చంద్రబాబు చేసిన అరాచకాల్ని పార్టులు పార్టులుగా బయటపెడుతున్నారు ఎంపీ విజయసాయి. మరీ ముఖ్యంగా విశాఖ కేంద్రంగా బాబు చేసిన అరాచకాలపై “విశాఖ కంటకుడు చంద్రబాబు” పేరిట సిరీస్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పార్ట్-1 రిలీజ్ చేసిన విజయసాయి.. తాజాగా పార్ట్-2 కూడా రిలీజ్ చేశారు.
తన 14 ఏళ్ల పాలన.. గడిచిన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు విశాఖను ఎలా తన పావులా వాడుకున్నారో విడమర్చి చెప్పారు విజయసాయి. మరీ ముఖ్యంగా హైటెక్ సీఎం అని సొంత డబ్బా కొట్టుకునే చంద్రబాబు.. విశాఖ ప్రజలకు ఎలా పంగనామాలు పెట్టారో సవివరంగా వెల్లడించారు.
మీటింగ్స్ లో ఆరు అబద్ధాలు, నాలుగు గాలిమాటలు మాట్లాడ్డం.. తర్వాత మీడియా ముందు నాలుగు గంటలు మాట్లాడ్డం మినహా విశాఖకు, విశాఖ జిల్లాకు బాబు చేసిందేం లేదని ఆరోపించారు.
విజయసాయి ఆరోపణల్లో కొన్నింటిని ఇక్కడ చూద్దాం.
– ప్రాంతాల మధ్య చిచ్చురేపడం బాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. అందుకే రాయలసీమ రౌడీలు వస్తున్నారంటూ విషప్రచారం చేశారు. ఇంతకీ ఈయన ఎక్కడివాడు?
– విశాఖకు విమ్స్ (విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) మొదలుపెట్టింది వైఎస్ఆర్. ఒక్క హాస్పిటల్ అయినా నీ హయాంలో కట్టావా బాబూ?
– విశాఖలో స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతానన్న హామీని గాలికొదిలేశావు.. కనీసం 14 ఏళ్ల పాలనలో ఒక్క యూనివర్సిటీ అయినా పెట్టావా?
– వైఎస్ఆర్ హయాంలో విశాఖ ఐటీలో 18వేల ఉద్యోగులుంటే.. బాబు టైమ్ కు 12వేలకు పడిపోయారు. పెరగాల్సింది పోయి.. హైటెక్ బాబునని చెప్పుకునే ఈయన హయాంలో ఎందుకు తగ్గినట్టు?
– 2018లోనే పోలవరం పూర్తిచేస్తానంటూ ప్రగల్బాలు పలికాడు. అది పూర్తయి విశాఖ జిల్లాకు కొంతైనా నీరు వస్తుందనుకుంటే.. మధ్యలో పట్టిసీమ అంటూ హడావుడి చేశాడు. గోదావరి నీళ్లు అటు తీసుకెళ్లాడు, విశాఖ గొంతు తడిపేందుకు మాత్రం పట్టించుకోలేదు.
– విశాఖలో ఒక్కసారి భాగస్వామ్య సదస్సు పేరు చెప్పి 150 కోట్లు ఖర్చు చేశాడు. తీరా చూస్తే వంద కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు. ఆ డబ్బేదో విశాఖలో రోడ్లు వేయడానికి, యువత స్కిల్ డెవలప్ మెంట్ కో ఖర్చు చేస్తే కొంతైనా ఉపయోగం ఉండేది.