చంద్రబాబులో ఓటమి భయం కొన్నిరోజులే ఉంది, ఆ తర్వాత తనతో పాటు తన పార్టీకి ఉనికే లేకుండా పోతుందన్న భయం మాత్రం బాబుని మరింతగా పట్టిపీడిస్తోంది. తాజాగా ప్రధానికి చంద్రబాబు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోందని, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్ట్ లు, న్యాయవాదుల ఫోన్లను వైసీపీ ట్యాపింగ్ చేస్తోందని ఆరోపించారు బాబు. ఇలాంటి వాటిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు.
గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు రాష్ట్రంలో పనిలేదన్న నోటి తోటే.. ఇప్పుడు మోడీ శరణుజొచ్చారు బాబు. అసలు వైసీపీ నేతలకు చంద్రబాబు ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముందనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న.
151 సీట్ల మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది వైసీపీ, 23 సీట్లు తెచ్చుకుని, ఇప్పుడు ఎంతమంది మిగిలున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది టీడీపీ. మరి చంద్రబాబుని చూసి ఏ రకంగా వైసీపీ భయపడుతుంది. భయపడి ఫోన్లను ఎందుకు ట్యాప్ చేస్తుంది. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడా జరగదని చెప్పలేం. బొటాబొటి మోజార్టీతో గద్దనెక్కిన సర్కారు, తమని తాము కాపాడుకోడానికి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఇలా ఫోన్లు ట్యాప్ చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి.
ఏపీలో అలాంటి పరిస్థితి లేదనేది అందరికీ తెలిసిన విషయం. మరి వైసీపీపై ఎందుకీ అపనిందలు. గతంలో తెలంగాణలో ఎమ్మెల్సీ సీటు కోసం చంద్రబాబు సాగించిన బేరసారాలు ఫోన్ రికార్డింగ్ ద్వారానే బైటపడ్డాయి. అప్పుడు కూడా తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ గోలచేసి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు చంద్రబాబు.
ఇప్పుడు కరోనా పేరు చెప్పి 4-5 నెలలుగా హైదరాబాద్ లో మకాం పెట్టిన చంద్రబాబు ఫోన్లను, ఏపీ ప్రభుత్వం ఎలా ట్యాప్ చేస్తుంది. ఏదో ఒక కారణంతో ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేసి, అక్కడ సింపతీ పొందాలని చూడటం కాకపోతే అసలిప్పుడు ఫోన్ ట్యాపింగ్ గొడవ ఎందుకొచ్చినట్టు?
జీవితకాలం చంద్రబాబుకి ఇలా పితూరీలు చెప్పడంతోనే టైమ్ సరిపోయేట్టుంది. ప్రస్తుతం ప్రభుత్వంపై అభాండాలు వేయడానికి బాబు దగ్గర ఏ పాయింట్ లేనట్టుంది. అందుకే ఇలా ఫోన్ ట్యాపింగ్ అంటూ గగ్గోలుపెడుతున్నారు. తన అక్రమాలు బయటపడతాయనే భయం బాబులో ఏ స్థాయిలో గూడుకట్టుకొని ఉందో ఈ ఒక్క లెటర్ తో బయటపడింది.