జనసేనాని పవన్‌కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నీతిమాలిన రాజకీయాలు చేయడం ఏంటంటూ ఆయన్ను నిలదీశారు. బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో తెరపడనుంది.
ఎన్నికలకు 72 గంటల ముందే ప్రచారం నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి నిమిషాన్ని పోటీదారులు ఓటర్లను ఆకట్టుకునేందుకు సద్వినియోగం చేసుకునేందుకు యత్నిస్తున్నారు.
బద్వేల్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబటి రాంబాబు తన సామాజిక వర్గానికి జనసేనాని పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణికి వైసీపీ టికెట్ ఇచ్చినందుకు వల్ల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు పవన్‌కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనసేనాని పవన్‌కు నిజాయితీ ఉందా? అని అంబటి ప్రశ్నించారు.
డాక్టర్ వెంకటసుబ్బయ్య కుటుంబంపై సానుభూతితో పోటీకి దూరంగా ఉన్నామని చెప్పిన సంగతి గుర్తుందా పవన్ అని అంబటి ప్రశ్నించారు. ఇప్పుడేంటి నీతిమాలిన రాజకీయం అని ఆయన నిలదీశారు. టీడీపీ, జనసేన లోపాయికారి కుట్రలు కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. జనసేన కార్యకర్తలు బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారని విమర్శించారు.
బద్వేల్ ఎన్నికల్లో తమ అభ్యర్థి దాసరి సుధ ఎప్పుడో గెలిచారని అంబటి అన్నారు. కేవలం మెజారిటీ కోసమే ప్రచారం చేస్తున్నామన్నారు. కేంద్రహోంమంత్రి అమిత్ షాపై తిరుపతిలో రాళ్లు వేయడం ఆయనకు ఆయనకు గుర్తుండదా అని అంబటి ప్రశ్నించారు.
అందుకే చంద్రబాబుకి అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. మా ఊరు వస్తే రాళ్లు వేస్తాం. మీ ఊరు వస్తే కాళ్లు పట్టుకుంటాం అంటే ఎలా..? అంటూ చంద్రబాబుపై తనదైన శైలిలో అంబటి సెటైర్లు విసిరారు.