అంతేగా..అంతేగా: మా బాబు బతుకు ఇంతేగా!

కాంగ్రెస్ మూలాల్ని కదిలించడం కోసం, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పై కక్షతో పుట్టిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టీని తీసుకెళ్లి సోనియాగాంధీ కాళ్ల ముందు పెట్టారు చంద్రబాబు. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారు.…

కాంగ్రెస్ మూలాల్ని కదిలించడం కోసం, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పై కక్షతో పుట్టిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టీని తీసుకెళ్లి సోనియాగాంధీ కాళ్ల ముందు పెట్టారు చంద్రబాబు. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారు. ఇలా ఎందుకు చేశారని బాబును అడక్కూడదు. ఎందుకంటే ఆయనంతే!

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం, అవసరం కోసం వేషాలు మార్చడం, తన పని జరగడం కోసం యూటర్న్ తీసుకోవడం బాబుకు బట్టర్ తో పెట్టిన విద్య. ఇప్పుడు అదే చంద్రబాబులో మరో యూటర్న్ కోణాన్ని వెలికితీశారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఆర్టికల్-356ను గతంలో రద్దుచేయమని చెప్పిన బాబు, ఇప్పుడు అదే ఆర్టికల్ ను ఏపీలో అమలు చేయాలనుకుంటున్నారు. బాబు యూటర్న్ లో కొత్త టర్న్ ఇది.

“తెలుగుదేశం పార్టీ పుట్టినప్పట్నుంచి, ఎన్టీఆర్ గారు మరణించే వరకు ప్రతి మహానాడులో ఆర్టికల్-356ను రద్దు చేయమని ప్రతిసారి తీర్మానం చేస్తూ వచ్చారు. కానీ అదే ఆర్టికల్ ను అమలు చేయమని చంద్రబాబు రాష్ట్రపతిని కోరుతున్నారు.”

విజయసాయి చెప్పిన ఈ మాట ఒక్కటే కాదు. బాబు జీవితంలో ప్రతి మలుపులో ఇలాంటి యూటర్న్ లు కోకొల్లలు కనిపిస్తాయి. గతంలో తిరుపతిలో అమిత్ షా కాన్వాయ్ పై రాళ్లు వేయించారు, నరేంద్ర మోదీని బండబూతులు తిట్టించారు. ఇప్పుడు వాళ్ల ఆశీర్వాదం, అపాయిట్ మెంట్ కోసం కాళ్లరిగేలా ఢిల్లీలో తిరుగుతున్నారు. వాళ్లతో పొత్తుకు అర్రులు చాస్తున్నారు.

అమరావతి రాజధాని కోసం ఆత్మత్యాగం చేస్తానన్నారు, తన భార్య గాజులు తీసి ఇచ్చారు. కట్ చేస్తే, ఇప్పుడు ఆ ప్రాంతం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. సొంత కుటుంబంలోనే ఎన్టీఆర్, హరికృష్ణ లాంటి వ్యక్తుల్ని వాడుకొని వదిలేశారు. ఈ విషయాల్ని ఎవ్వరూ బాబు ముందు ఎత్తకూడదు. ఎందుకంటే ఆయనంతే!

పార్టీ లేదు బొక్కా లేదు అనే వ్యక్తిని తన పక్కన కూర్చోబెట్టించుకున్నారు. టీడీపీని కులగజ్జి పార్టీ అన్న వ్యక్తిని నెత్తిన పెట్టుకున్నారు. రాజీనామా చేస్తానని చెప్పి బండబూతులు తిట్టిన వ్యక్తిని బుజ్జగించారు. తెలుగుదేశాన్ని ''కమ్మ''ని దేశంగా మార్చేసిన వ్యక్తులకు పదవులిచ్చారు. పార్టీ కోసం కష్టపడిన నిజమైన నేతల్ని మాత్రం క్షేత్రస్థాయిలో, అలానే గాలికొదిలేశారు. ఈ విషయాల్ని బాబు ముందు ప్రస్తావించకూడదు. ఎందుకంటే ఆయనంతే.

ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు గురించి రాయడానికి పేజీలు సరిపోవు. తనను తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ గా చెప్పుకునే ఇలాంటి వ్యక్తి దొంగ దీక్షలు చేస్తే జనాలు నమ్ముతారా? ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే బీజేపీ నేతలు కరుగుతారా? ఇవేవీ జరిగే పనులు కాదనే విషయం బాబుకు కూడా తెలుసు. కానీ ఆయనలా కలరింగ్ ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయనంతే.