ఎన్టీఆర్ రూ.100 బిళ్ల: అంత గొప్ప ఏముంది బాసూ!?

చాలా మందికి కోపం రావొచ్చు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయిన నందమూరి తారక రామారావు శతజయంతి సంవత్సరం సందర్భంగా.. ప్రతిష్ఠాత్మకంగా వందరూపాయల బిళ్లను రూపొందిస్తే.. దానిని ఏకంగా భారత దేశ రాష్ట్రపతి చాలా ఘనంగా ఆవిష్కరిస్తే..…

చాలా మందికి కోపం రావొచ్చు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయిన నందమూరి తారక రామారావు శతజయంతి సంవత్సరం సందర్భంగా.. ప్రతిష్ఠాత్మకంగా వందరూపాయల బిళ్లను రూపొందిస్తే.. దానిని ఏకంగా భారత దేశ రాష్ట్రపతి చాలా ఘనంగా ఆవిష్కరిస్తే.. అందులో గొప్ప లేదని అంటారా? అని ఆగ్రం కలగవచ్చు. కానీ కాస్త లోతుగా గమనించినప్పుడు ఇది మరీ అంత గొప్ప విషయం కాదని అర్థమవుతుంది. అలాగే ఆ మహానటుడిని మరింత గొప్పగా సత్కరించుకోవడం సాధ్యమవుతుందని కూడా తెలిసొస్తుంది.

అక్కడికేదో ఈ రూ.100 బిళ్లను భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం తీసుకువచ్చినట్టుగా.. కార్యక్రమంలో పాల్గొనడానికి పార్టీ సారథి జెపినడ్డా కూడా వచ్చారు. కానీ ఇది ప్రభుత్వం తెచ్చిన నాణెం కాదు. జరిగినది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాదు. అది, అధికారిక నాణెం కానేకాదు!

ఇలా ప్రత్యేక దినోత్సవాల్లో ప్రత్యేక నాణేలను ఎవ్వరైనా విడుదల చేసుకోవచ్చు. అయితే కేంద్రప్రభుత్వం వాటిని మింట్ ద్వారా ముద్రించి అమ్మడానికి అనుమతించడం మాత్రం అవసరం. అంటే.. ప్రభుత్వ మింట్ ద్వారా జరిగే వ్యాపారం అన్నమాట. 

ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం వచ్చేసిందని ఎవరైనా అంటే.. బజార్లో అంగళ్లలో అది మనకు ఇస్తారని ఆశించినా గానీ.. పొరబాట్న మన వద్ద ఆ కాయిన్ ఉంటే దానిని తీసుకెళ్లి కిళ్లీ కొట్టులో ఇచ్చి వంద రూపాయలకు సరిపడా సిగరెట్ పెట్టె కొనుక్కోవచ్చునని గానీ అనుకుంటే.. ఇంకా పెద్ద పొరబాటు. 

ఎందుకంటే.. ఈ నాణేలకు సమాజంలో నగదుగా చెలామణీ ఉండదు. కేవలం జ్ఞాపికలుగా మాత్రమే ఆ నాణేలు ఉంటాయి. ఎన్టీఆర్ నాణేన్ని ముద్రించిన హైదరాబాదు మింట్ వారు.. ప్రస్తుతం పదివేల నాణేలు ముద్రిస్తున్నామని, ‘డిమాండ్’ ను బట్టి యాభైవేల నాణేలు ముద్రించగలమని అంటున్నారు. 

నిజానికి ఇది నగదుగా చెలామణీ అయ్యే అవకాశం లేని, వెండి మరియు ఇతర లోహాలు కలిపి తయారుచేసిన కాయిన్ మాత్రమే అని తెలుసుకోవాలి. దీనిని మింట్ వారు సుమారు నాలుగువేల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు వీటిని కొని జాగ్రత్తగా దాచుకోవచ్చు. అంతే! నగదుగా వాడుకోలేరు.

నిజానికి ఈ నాణెం తయారీలో యాభైశాతం వెండితో పాటు ఇతర లోహాలు కూడా కలుపుతారు. ఇది నలభై గ్రాముల కాయిన్ మాత్రమే. ఆ మాటకొస్తే.. గ్రాము వెండి 80 ధర పలుకుతున్న ఈరోజుల్లో నలభై గ్రాముల అచ్చమైన వెండితో ఎన్టీఆర్ నాణేన్ని తెలుగుదేశం పార్టీ, లేదా, ఎన్టీఆర్ శతజయంత్యోత్సవ నిర్వహణ కమిటీలు తయారుచేయించి అభిమానులకు ఇదే ధరకు విక్రయించవచ్చు. దానికి కనీసం వెండి విలువ అయినా ఉంటుంది. ఈ కాయిన్ కు ఎన్టీఆర్ బొమ్మ ఉన్న నాణెం అనే పేరు తప్ప కొన్న తరువాత ఎలాంటి విలువ ఉండదు. మహా అయితే మరో ఎన్టీఆర్ అభిమానికి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. 

ఇలాంటి ప్రెవేటు కాయిన్ కు ఇంత పెద్ద హడావుడి చేయడం ఏమిటో అర్థం కావడం లేదు. ఆ మాటకొస్తే కేంద్రప్రభుత్వ పోస్టల్ విభాగంలో మరో ఏర్పాటు ఉంటుంది. మైస్టాంప్ పేరుతో.. మనం మన బొమ్మనే స్టాంపుగా పొందవచ్చు. అది కేవలం ఈ స్పెషల్ స్మారక నాణేల్లాగా దాచుకోవడానికి మాత్రమే కాదు. కవర్ల మీద అంటించి పోస్టు చేయడానికి వాడుకోవచ్చు కూడా. కాకపోతే ఖరీదు ఎక్కువ పడుతుంది. ఈ పోలికను గమనిస్తే.. స్మారక నాణెం తయారు కావడం గొప్ప విషయమే కావొచ్చు. 

కానీ.. అదేదో మహాద్భుతం అన్నట్టుగా ప్రచారం చేసుకోవడమే చిత్రంగా ఉంది. నిజంగానే ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్రప్రభుత్వం రిజర్వు బ్యాంకు పౌరవినియోగంలో ఉండేలాగా నాణెం విడుదల చేసి ఉంటే అప్పుడది ఖచ్చితంగా ఆ మహానుభావుడికి అర్పించిన గొప్ప నివాళిగా ఉండేది.