గతంలో అయితే.. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళితే హడావుడి ఒక రేంజ్ లో ఉండేది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004-09 ల మధ్య అయితే.. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చోటామోటా పార్టీ అధినేతలను కలిసి కూడా తన గోడును వెళ్లబోసుకునే వారు. అప్పట్లో అజిత్ సింగ్ లాంటి వాళ్ల ఇంటికి కూడా వెళ్లి చంద్రబాబు నాయుడు బాధలు చెప్పుకునేవారు.
కాంగ్రెస్ పై పోరాటం అంటూ కలిసి రావాలంటూ.. ములాయం వంటి వాళ్లతో భుజం భుజం రాసుకునే వారు. ఇక ఢిల్లీలో చంద్రబాబు నాయుడు వారిని కలిశారు, వీరిని కలిశారు.. అంటూ పచ్చమీడియా ఏదో జరిగిపోతోంది, ఇక కాంగ్రెస్ ను జాతీయ స్థాయిలో దించేయడమే అనేంత రేంజ్ లో హడావుడి చేసేది.
ఇక గత ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు చాలా రచ్చే చేశారు ఢిల్లీ లెవల్లో. మోడీని దించడమే లక్ష్యమంటూ, చంద్రబాబుతో మోడీ పెట్టుకున్నాడని, ఇక ఆయన కథ అంతేనంటూ టీడీపీ ఆర్టిస్టులు హడావుడి చేశారు. కట్ చేస్తే.. చాన్నాళ్లకు ఢిల్లీ ప్రయాణం పెట్టుకుని, తన ఫిర్యాదుల పెట్టెను వెంట పెట్టుకెళ్లారు. తీరా అక్కడ టీడీపీ ఆశించిన అపాయింట్ మెంట్లేవీ దక్కలేదు. దీంతో కిక్కురుమనకుండా తిరిగి వచ్చినట్టున్నారు.
అయితే చంద్రబాబు నాయుడు ఏపీలో ప్రజాస్వామ్యానికి ఏదో అయిపోతోందని తెగ ఇదైపోతున్నారు కాబట్టి, ఈ విషయంలో కనీసం ఖాళీగా ఉన్న కొంతమందిని అయినా కలిసి, గోడు వెళ్లబోసుకోవాల్సింది. మొన్నటి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు స్నేహం చేసిన సోనియాగాంధీ అక్కడ ఖాళీగానే ఉన్నారు.
రాహుల్ కు కూడా ఇప్పుడు పనేమీ లేదు, బహుశా విహార యాత్రల్లోనూ లేడు. ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేతల ఇళ్లు, ఆఫీసులు ఖాళీగానే ఉన్న పరిస్థితి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వారిని కలిసి ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని, ప్రజాస్వామ్యం లేదని చెప్పుకోవాల్సింది పాపం!
ఇంకా ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ పార్టీల నేతలు కూడా చంద్రబాబు వెళ్లి ఉంటే.. ఆలింగనం చేసుకునే వారేమో! వీళ్లంతా చంద్రబాబు మాజీ దోస్తులే కదా! అయితే ఇప్పుడు వారి ఇళ్లకు వెళితే తన పరిస్థితి ఏమిటనే భయం చంద్రబాబుకు ఉంది కాబోలు! అందుకే అటూ ఇటూ చూసినట్టుగా లేరు.
దక్కితే మోడీ, షా అపాయింట్ మెంట్ .. ఇక ఎన్డీయేతర పార్టీల నేతల ఇళ్ల వద్దకు వెళ్లే సాహసం కూడా చేయలేకపోయినట్టుగా ఉన్నారు. ఒకవేళ ప్రయత్నించి ఉంటే.. బీజేపీ కురువృద్ధ నేత అద్వానీ అపాయింట్ మెంట్ కూడా చంద్రబాబుకు లభించేదో ఏమో! అయితే అటు వెళ్లినా మోడీ, షాలకు కోపం వస్తుందని భయపడ్డారు కాబోలు.