గుజరాత్ తీరంలో ఏపీ అడ్రస్ తో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడినప్పటి నుంచి ఏపీ డ్రగ్స్ హబ్ గా మారిపోయిందంటూ టీడీపీ ఒక పాట అందుకుంది. ఆ పాటకు రోజుకోరకంగా పల్లవులు పాడుతూనే ఉంది.
ఆఖరికి చంద్రబాబు నాయుడు ఎంత వరకూ వచ్చారంటే.. ఏపీలో మద్యం దొరక్క ప్రజలు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారట! హెరాయిన్ కొనుక్కుని వాడుతున్నారట.. అది కూడా మద్యం దొరకనట! బొంకరా.. బొంకరా.. బోలిగా అంటే, తాడికొండ మిరియాలు తాటికాయలంత! అన్నట్టుగా వ్యవహరించడం చంద్రబాబుకు కొత్త కాదు. అయితే ఈ విషయంలో ఆయన డిగ్రీలు ఎక్కువయిపోతున్నాయి..
మద్యం దొరకడం లేదని, అందుకే పక్క రాష్ట్రాలకు వెళ్లి తాగి వస్తున్నారని, అలాగే డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని అనడం చంద్రబాబుకే చెల్లుతోంది! పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోల్ పోయించుకుని, అక్కడే మద్యం తాగి వస్తున్నారట. ఇదీ చంద్రబాబు వెల్లగక్కుతున్న బాధ. ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలోనూ పెట్రోల్ ధరల మధ్య పెద్ద తేడా లేదు.
చంద్రబాబుగారు సీఎంగా ఉన్న రోజుల్లో.. కర్ణాటక సరిహద్దుల్లో బోర్డులు పెట్టే వారు. ఏపీ కన్నా.. లీటర్ పెట్రోల్ పది రూపాయల వరకూ తక్కువ అని, కర్ణాటక సరిహద్దుల్లోని పెట్రోల్ బంకుల ముందు బోర్డులు పెట్టే వారు. హైవే వెంబడ వచ్చేవారు అక్కడే ట్యాంకులు ఫుల్ చేయించుకునే వారు.
ఇప్పుడు అదే కర్ణాటకతో పోల్చిన, తమిళనాడు, తెలంగాణలతో పోల్చినా.. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. చంద్రబాబు హయాంలో కర్ణాటకలో ఏపీలో కన్నా ఏడెనిమిది రూపాయల నుంచి ఒక దశలో పది రూపాయల తక్కువ ధరకు దొరికేది లీటర్ పెట్రోల్.
ఇప్పుడు కర్ణాటక-ఏపీ మధ్య పెట్రోల్ ధరలో లీటర్ కు రూపాయి, రెండు రూపాయలకు మించిన వ్యత్యాసం లేదు. తన హయాంలో ఈ వ్యత్యాసం పది రూపాయల వరకూ ఉండిందనే విషయాన్ని తనే గుర్తు చేస్తున్నారు చంద్రబాబు!
చంద్రబాబు ఢిల్లీ లో.. ఏపీలో డ్రగ్స్ వాడకం విశృంఖలం అయిపోయిందనేంత రేంజ్ లో డబ్బా కొట్టి వస్తే, ప్రజలు మద్యం దొరక్క డ్రగ్స్ వాడుతున్నారంటూ.. వెర్రి మొర్రి ప్రచారం చేసి వస్తే, అందుకు అనుగుణంగా ట్వీట్లేశారు పవన్ కల్యాణ్. ఏపీ డ్రగ్స్ హబ్ గా మారిపోయిందంటూ పవన్ కల్యాణ్ ట్వీటేశారు.
చంద్రబాబు డ్రగ్స్ గురించి మాట్లాడారు కాబట్టి.. తనుకూడా ఆయన ట్యూన్ కు అనుగుణంగా డప్పు కొట్టక తప్పదన్నట్టుగా చంద్రబాబు పార్ట్ నర్ స్పందించినట్టుగా ఉన్నారు. అదేమంటే..2018లో తను డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాట యాత్ర చేపట్టారట. మరి అప్పటిది ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? అయినా.. ప్రజలు కనెక్ట్ కాని, ఈ తప్పుడు ప్రచారాలు, రాష్ట్రం మొత్తం డ్రగ్స్ వాడుతోంది, రాష్ట్రం మొత్తం డ్రగ్స్ హబ్ గా మారిపోయింది, స్కూలు పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారు అంటూ.. చేసే ప్రచారాలతో ఏం సాధిద్ధామని అనుకుంటున్నారో ఈ పార్ట్ నర్స్.
హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో, బెంగళూరులో కూడా అనేక సార్లు డ్రగ్స్ బయటపడ్డాయి. డబ్బున్న వాళ్ల పిల్లలు, సెలబ్రిటీలు, వారి పిల్లలు డ్రగ్స తో దొరుకుతున్నారు. దీనికి రాష్ట్రం అంటూ మినహాయింపు లేదు. ఇక ఏపీలో గంజాయి మూలాలు ఉన్నాయంటే, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు జరుగుతూనే ఉంటాయి.
టీడీపీ హయాం కూడా దీనికి మినహాయింపు కాదు. అది కూడా గంజాయే. దీన్ని చట్టబద్ధం చేయాలనే వాదనా పాతదే. ఏజెన్సీ ప్రాంతంలో దొంగచాటుగా జరిగే గంజాయి పెంపకాన్ని పట్టుకుని.. ఏపీ మొత్తం డ్రగ్స్ హబ్ గా మారిపోయింది, మద్యం దొరక్క డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారంటూ.. చంద్రబాబు, పవన్ లు జోడు బాజాలు మోగిస్తున్నట్టుగా ఉన్నారు. మరి దీని ప్రయోజనాలు ఏంటో మరి!