ఎక్కడయినా ఏ పెద్ద హీరో అయినా ఓ సినిమా తరువాత మరో సినిమా చేస్తూ వుంటారు. మహా అయితే లైనప్ రెడీగా వుంచుకుంటారు తప్ప, ప్రతీ సినిమా కొబ్బరికాయ కొట్టించేసి అటో అడుగు..ఇటో అడుగు అన్నట్లు వుండదు వ్యవహారం. కానీ మెగా బ్రదర్స్ చిరు, పవన్ ల రూటు వేరుగా వుంది.
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ షూట్ అవుతోంది. మరోపక్కన హరి హర వీరమల్లు సినిమా సగంలో ఆగివుంది. ఇప్పుడు భీమ్లానాయక్ పాటల వరకు వచ్చాక మళ్లీ అటు వెళ్తారు. ఈ రెండూ ఇలా వుండగానే టైటిల్ అనౌన్స్ జరిగిపోయి కూడా హరీష్ శంకర్ సినిమా పెండింగ్ లో వుంది.
మెగాస్టార్ కూడా ఇదే రూటులో వెళ్తున్నారు. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ ప్రారంభించారు. అది మెల మెల్లగా నడుస్తోంది. ఈ లోగా బాబీ డైరక్షన్ సినిమాకు పూజ జరిపించేసారు. అక్కడితో ఆగకుండా ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద భోళాశంకర్ పూజకు ముహుర్తం పెట్టేసారు. అంతే కాదు నవంబర్ 15 నుంచి షూటింగ్ అంటున్నారు.
అంటే గాడ్ ఫాదర్ కొన్నాళ్లు పక్కన వుంటుందన్నమాట. మొత్తానికి చూస్తుంటే సినిమా 50 నుంచి 60 కోట్ల వంతున చకచకా ఓ అరడజను సినిమాలు చేసేసి మంచి మొత్తంతో రిటైర్ కావాలని చూస్తున్నట్లుంది అన్నదమ్ములు ఇద్దరూ.