‘వీడియోలను చూసే జగన్ ను అనుకరించా’

'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రను చేస్తున్న అజ్మల్ తన పాత్ర తీరుతెన్నులను వివరించాడు. విశేషం ఏమిటంటే.. గత ఏడాది ఇదే సమయంలో 'యాత్ర' సినిమాకు…

'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రను చేస్తున్న అజ్మల్ తన పాత్ర తీరుతెన్నులను వివరించాడు. విశేషం ఏమిటంటే.. గత ఏడాది ఇదే సమయంలో 'యాత్ర' సినిమాకు సంబంధించి మమ్ముట్టీ చేసిన వైఎస్ పాత్ర షూటింగ్ దాదాపు మొదలైంది. ఇప్పుడు వైఎస్ జగన్ పాత్రను మరో మలయాళీ నటుడు చేస్తూ ఉన్నాడు. అజ్మల్ కూడా మలయాళీనే. కొన్ని తెలుగు సినిమాల్లో నటించాడు.

ఇప్పటికే విడుదల అయిన 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా ట్రైలర్ లో అజ్మల్ హావభావాలు ముమ్మూర్తులా వైఎస్ జగన్ ను గుర్తుచేసేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అజ్మల్ తను జగన్ ను అనుకరించిన వైనం గురించి వివరించాడు. తను ఎప్పుడూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవలేదు అని అజ్మల్ చెప్పాడు. అయితే ఈ పాత్రకు  తను ఎంపిక అయ్యాకా.. వైఎస్ జగన్ కు సంబంధించిన వీడియోలను చూసినట్టుగా చెప్పాడు. అలా ఆయనను అనుకరించినట్టుగా వివరించాడు.

'ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్. ప్రస్తుత పరిణామాల ఆధారంగా రూపొందింది. దీంతో నటీనటుల విషయంలో రూపకర్తలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో నేను వైఎస్ జగన్ పాత్రకు షార్ట్ లిస్ట్ అయ్యాను. నేను ఆ పాత్రకు సరిపోతానని వారు భావించారు..' అని అజ్మల్ అన్నాడు.

'నేనెప్పుడూ వైఎస్ జగన్ ను కలవలేదు. నెలకిందట షూటింగ్ మొదలైంది. నా పాత్రకు మంచి స్పందన వస్తుండటం ఆనందాన్ని ఇస్తోంది. గతంలో కూడా నేను చీఫ్ మినిస్టర్ పాత్రను చేశాను.'రంగం' సినిమాలో నాది సీఎం పాత్రే..' అని అజ్మల్ గుర్తు చేశాడు. 'గత ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ గెలిచి, అధికారాన్ని సంపాదించుకోవడం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది…' అని అజ్మల్ చెప్పాడు.

ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్ర లేదని అజ్మల్ పేర్కొన్నాడు. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ తదితర పాత్రధారులు కూడా దాదాపు ఒరిజినల్ వ్యక్తులతో పోలినట్టుగానే ఉన్నారు. బ్రహ్మానందం, అలీలు కూడా ఈ సినిమాలో నటించినట్టుగా ట్రైలర్ తో స్పష్టం అవుతోంది.