అనుకున్నట్లే అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనమాట మార్చి, మళ్లీ మొహానికి మేకప్ వేసుకునే దిశగా నడుస్తున్నారు. జనం కోసం, రాజకీయాల కోసం కోట్ల ఆదాయం వచ్చే సినిమాలు వదిలేసానని, అది ముగిసిన అధ్యాయమని, ఇక మళ్లీ సినిమాల ఆలోచన లేదని అర్థంవచ్చేలా, పదే పదే ప్రవచించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మార్చి సినిమాల్లో అడుగు పెడుతున్నారని అర్థమైపోతోంది. బహుశా దానిని ఆయన భలేగా సమర్థించుకోవచ్చు. పార్టీని నడపడం కోసం ఆర్థిక వనరులు అవసరమని, అందుకే సినిమాల్లోకి వెళ్తున్నా అని చెబితే చెప్పే అవకాశం వుంది. దానికి జనసేన తమ్ముళ్లు అంగీకరించవచ్చు కూడా.
కానీ సినిమాల్లోకి వెళ్తే రాజకీయాల సంగతేమిటి? గడచిన అయిదేళ్లూ కూడా పవన్ సినిమాల్లో వున్నా లేకున్నా, పార్ట్ టైమ్ రాజకీయాలే చేసారు. మండల, జిల్లా, ప్రాంతీయ కమిటీలు, ఎక్కడికక్కడ పార్టీ నిర్మాణం వంటివి లేకుండానే ఎన్నికలను ఫేస్ చేసారు. అందుకే దారుణంగా దెబ్బతిన్నారు. పోల్ మేనేజ్ మెంట్ అన్నది అస్సలు పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఫుల్ టైమర్ గా వుంటూనే, పార్ట్ టైమ్ రాజకీయాలు చేసిన పవన్, ఇప్పటికీ అదే పద్దతిలో వున్నారు. ఎక్కడా కూడా జనసేన కమిటీలు కానీ, బాధ్యులు కానీ పెద్దగా లేదు. కీలక నాయకులు కూడా లేరు. వున్న కొద్ది మందీ తలోదారి చూసుకుంటున్నారు.
ఇలాంటి నేపథ్యంలో పవన్ సినిమాల్లోకి వెళ్తే పార్టీ పరిస్థితి ఏమిటి? నాదెండ్ల మనోహర్ నే పార్టీని నడపాలి. ఇప్పటికే పార్టీకి కీలక మద్దతు దారులైన కాపు సామాజిక వర్గానికి నాదెండ్ల అంటే అసంతృప్తిగా వుంది. నాదెండ్లకు పవన్ ప్రాధాన్యత ఇవ్వడం వారికి అంతగా నచ్చడం లేదని గుసగుసలు వినిపిస్తూనే వున్నాయి. పోనీ నాదెండ్లను కాదంటే మరెవరినైనా పెట్టాలి. పవన్ అంత సులువుగా నమ్మే పరిస్థితి లేదు. అందువల్ల పార్టీ పనులు పూర్తిగా పక్కన వుంటాయోమో అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.
అలాచేసే 2024 నాటికి కూడా పార్టీ ఇలాగే వుంటుంది తప్ప, బలమైన స్థానానికి ఎదగడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పవన్ రెండు సినిమాలు ఒప్పుకున్నారు. ఏ ఒక్కటి హిట్ అయినా ఇక ఆ సినిమాల వ్యవహారం అలా కొనసాగుతుంది. పైగా ఇప్పుడు ఆయన చేయబోయేవి రెండు సినిమాలు. ఒకటి ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్నదానికి, రెండోది వేరే వారికి. ఇవికాక ఇంకా రెండు మూడు అడ్వాన్స్ లు ఆయనకు వున్నాయి. అంటే వాళ్లకు కూడా చేయాలి. అందువల్ల 2024 వరకు సినిమాలతో పవన్ బిజీగా వుండే పరిస్థితి వుంది.
దీనివల్ల ఫ్యాన్స్ హ్యాపీ కావచ్చు. అందులో సందేహం లేదు. కానీ కొత్తగా ఓటు బ్యాంక్ వస్తుందని కానీ, పార్టీ బలోపేతం అవుతుందని కానీ అనుకోవడానికి లేదు. పవన్ మీద ఫ్యాన్స్ ఎప్పుడూ ఒకలాగే వున్నారు. వుంటారు. కొత్తగా సినిమా చేసినా చేయకున్నా, కానీ ఓట్లు వేయాల్సిన జనం దృక్పధం మారాల్సి వుంది. 2019లో ఓటు వేయని జనం 2024 జనసేనకు ఓటు వేయాలంటే పవన్ ఏదో ఒకటి, ఎంతోకొంత పార్టీ కోసం చేయాలి. కానీ అలా చేయకుండా సినిమాలు చేసుకుంటే, జనసేనకు ఉపయోగం ఏముంటుంది?
అందుకే పవన్ సినిమాలు చేసుకుంటే ఫ్యాన్స్ తో పాటు, యాంటీ జనసేన పార్టీలు కూడా హ్యాపీ అవుతాయోమో?