నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో చోటు చేసుకున్న దుర్ఘటన రాజకీయ రంగు పులుముకుంది. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చే అమాయకులైన ప్రజల ప్రాణాల్ని తీసిందనే విమర్శలను అధికార పార్టీ నేతలు బలంగా చేస్తున్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కేంద్రంగా వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుండడం విశేషం.
మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కందుకూరులో ముమ్మాటికీ మానవ తప్పిదం వల్లే దుర్ఘటన చోటు చేసుకుందని విమర్శించారు. చంద్రబాబు విచిత్ర, విపరీత ధోరణే విషాదానికి కారణమైందని మండిపడ్డారు. చంద్రబాబు ఏర్పాటు చేసే సమావేశాలలను పరిశీలిస్తే… ఇరుకుగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారని ఆరోపించారు. స్థలం తక్కువ ఉన్న ప్రాంతాల్లో సభ ఏర్పాటు చేస్తే, జనం ఎక్కువ ఉన్నట్టు చూపుకునే క్రమంలో దుర్ఘటన చోటు చేసుకుందని వాపోయారు.
చంద్రబాబు సభలకు విశేషమైన జనం వస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు బాకా వూదుతున్నాయని ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబునాయుడు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకున్నారని, ఎక్కడ, ఎంత మంది జనాన్ని కూలీకి తోలాలో , మీడియాలో లేనిది ఉన్నట్టుగా ఏ విధంగా చిత్రీకరించాలనే అంశంపై దృష్టి పెట్టారన్నారు. ఇందులో భాగంగా కందుకూరు రోడ్ షోను చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. చంద్రబాబుకు ఏ స్థాయిలో అధికార దాహం వుందో విషాద ఘటనే నిదర్శనమన్నారు.
కందుకూరులో ఎన్టీఆర్ సర్కిల్లో ఇరుకు ప్రాంతంలో ఏర్పాటు చేసి దుర్ఘటనకు కారణమయ్యారని విమర్శించారు. 20 అడుగుల వెడల్పు ఉన్న రోడ్లో చంద్రబాబు వాహనం వచ్చిందన్నారు. టీడీపీ గ్రూపు రాజకీయాలు కూడా జనం ఎక్కువ చూపించాలనే కుట్రకు కారణమయ్యాయని విమర్శించారు. చివరికి చంద్రబాబు ప్రయత్నం వికటించడం వల్ల 8 మంది మృత్యువాత పడ్డారన్నారు. 8 మందిని చంద్రబాబు బలిగొన్నారని ఆరోపించారు. కూలి కోసం చంద్రబాబు సభకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారని మంత్రి కాకాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చంద్రబాబు చేసిన హత్యలుగా ఆయన అభివర్ణించారు.