వచ్చే నెల 27న కుప్పం నుంచి పాదయాత్ర చేపట్టనున్న నారా లోకేశ్‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సెటైర్స్ విసిరారు. కుప్పంలో వైసీపీని గెలిపించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి తన భుజాలపై వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుప్పం నుంచే లోకేశ్ పాదయాత్ర చేపట్టడంపై తనదైన శైలిలో మంత్రి విమర్శలు గుప్పించారు.
లోకేశ్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిల పాదయాత్రలకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా అని మంత్రి అన్నారు. నారా లోకేశ్ పాదయాత్ర గురించి పేపర్లలో చూసి తెలుసకున్నట్టు మంత్రి చెప్పారు. రోజుకు 10 కిలోమీటర్లు నడిస్తే ఆయన ఆరోగ్యానికి మంచిదని మంత్రి సలహా ఇచ్చారు. ఇందులో వెటకారం ధ్వనిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లోకేశ్ పాదయాత్రను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్య ద్వారా లోకేశ్‌ను వైసీపీ లైట్ తీసుకుందన్న సంకేతాలను ఆయన పంపారు. లోకేశ్ అడుగు పడక ముందే, ఆయనపై సెటైర్స్ మాత్రం పేలుతున్నాయి. ఇదిలా వుండగా జగన్‌కు నమ్మకంగా ఉన్నామనే తమను ఎల్లో మీడియా టార్గెట్ చేసిందని మంత్రి అన్నారు.
లోకేశ్‌కు సంబంధించి రాజకీయాల్లో ప్రజల స్పందనే ప్రధానమని మంత్రి చెప్పారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, అలాగే సుదీర్ఘ కాలం ప్రతిపక్ష నేతగా వుండి లోకేశ్ తండ్రి చంద్రబాబు ఏం చేశారని మంత్రి నిలదీయడం గమనార్హం. కందుకూరులో చంద్రబాబు సభలో విషాదం చోటు చేసుకోవడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవైపు సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతే, అందరూ ఇక్కడే ఉండాలని, తాను బాధితులను పరామర్శించి మళ్లీ సభ నిర్వహిద్దామని చంద్రబాబు అనడంపై మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు పదవీ కాంక్షకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మంత్రి ప్రశ్నించారు. తన సభ కోసం వచ్చిన వాళ్లు చనిపోయారనే ఆవేదనే బాబు కనిపించలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికార దాహాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.