ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను ఈ విషయంలో అభినందించాలి. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. విషాదం చోటు చేసుకోవడంపై ఆవేదన వెలిబుచ్చారు. అంతేకాదు, చంద్రబాబును నిలదీశారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టామని గొప్పలు చెప్పుకునే వాళ్లు ….ఈ ఘటనపై కంటి తుడుపు ప్రకటన చేశారు. కానీ కేఏ పాల్ మాత్రం ప్రశ్నలతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఎక్కడో గ్రౌండ్‌లో పెట్టుకోవాల్సిన సభను, రోడ్డుపై ఎలా నిర్వహిస్తారని కేఏ పాల్ నిలదీయడం గమనార్హం. అంతేకాదు, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు రాజకీయ ఎక్స్‌పీరియన్స్‌ను ఆయన ప్రశ్నించారు. కేవలం రోడ్డుపై సభ పెట్టుకోవడం వల్లే 8 మంది ప్రాణాలు పోయాయని ఆయన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేయాలన్నారు. అలాగే చంద్రబాబు టీడీపీకి రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేయడం గమనార్హం.
ఏ పార్టీకి చెందిన కార్యకర్తలనేది ముఖ్యం కాదని, 8 మంది ప్రాణాలు పోవడం బాధాకరమన్నారు. పోయిన ప్రాణాలకు రూ.10 లక్షలతో విలువ కడ్తారా? అని కేఏ పాల్ నిలదీశారు. ఓటుకు రూ.3 వేలు, ప్రాణాలకు లక్ష , రూ.10 లక్షలు చెల్లిస్తారా? ఇదే మీ (నాయకులు) ప్రాణాలు పోతే మాత్రం లక్ష కోట్లు, పది లక్షల కోట్లా? అని పాల్ ప్రశ్నించారు. కరోనా సమయంలో వెయ్యి లేదా 2 వేల మంది పట్టే చోటికి 50 వేల మందిని ఎలా తీసుకొస్తారని కేఏ పాల్ ప్రశ్నించారు.
దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు చంద్రబాబు నాయుడు అని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహించి రాజకీయాలకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే అమెరికాలో అయితే చంద్రబాబు తప్పించుకోగలరా? అని ఆయన ప్రశ్నించారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆయన ముందుకొచ్చారు. మృతుల పిల్లలకు తన చారిటీ సంస్థ ద్వారా ఉచిత విద్యను అందిస్తానని ఆయన హామీ ఇవ్వడం విశేషం. పవన్‌తో పోల్చితే కేఏ పాల్ రాజకీయంగా చాలా యాక్టీవ్‌గా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటు ఆంధ్రా, అటు తెలంగాణ రాష్ట్రాల్లో ఆయన విస్తృతంగా తిరుగుతున్నారు. గెలుపోటములను పక్కన పెడితే రాజకీయ పరమైన కార్యకలాపాల్లో కేఏ పాల్ చురుగ్గా ఉన్నారనేది వాస్తవం. ఇందుకు కందుకూరు పర్యటనే నిదర్శనం.