బీజేపీ ఎంపీని జగదాంబ జంక్షన్ లో వదిలేస్తే…?

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పుట్టింది ప్రకాశం జిల్లా. రాజకీయంగా ఉంటున్నది ఢిల్లీలో. బీజేపీ వారి దయతో రాజ్యసభ సీటు దక్కించుకున్నది ఉత్తర ప్రదేశ్ లో. ఆయన రాజ్యసభ సభ్యత్వం తొందరలో పూర్తి అవుతోంది.…

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పుట్టింది ప్రకాశం జిల్లా. రాజకీయంగా ఉంటున్నది ఢిల్లీలో. బీజేపీ వారి దయతో రాజ్యసభ సీటు దక్కించుకున్నది ఉత్తర ప్రదేశ్ లో. ఆయన రాజ్యసభ సభ్యత్వం తొందరలో పూర్తి అవుతోంది. 2024 ఎన్నికల కోసం ఆయన విశాఖను ఎంచుకుంటున్నారు. ఎందరో వలసవాదులకు చోటిచ్చిన విశాఖ తనకు ఇవ్వబోదా అని జీవీఎల్ ఆశపడుతున్నారు.

దాంతో వారంలో ఒకసారి విశాఖకు విమానంలో వస్తున్న జీవీఎల్ మీడియాతో కనెక్ట్ అవుతూ వైసీపీ మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద కామెంట్స్ చేస్తున్నారు. దాంతో తాను విశాఖ రాజకీయ వాసిని అయిపోయినట్లుగా ఆయన ఫీల్ అవుతున్నారు. జీవీఎల్ ఈ అతి ఉత్సహంతో ఐటీ మంత్రి గుడివాడ అమర్నాధ్ కి తన శాఖ మీద అవగాహన లేదని పుసుక్కున మాట విసిరేశారు.

యువ మంత్రి గుడివాడ ఊరుకుంటారా. జీవీఎల్ ని పట్టుకుని మాటలతో చెడుగుడు ఆడేశారు విశాఖలో రాజకీయం చేస్తానంటున్న జీవీఎల్ కి ఈ ప్రాంతం గురించి ఏమి తెలుసు. జగదాంబ జంక్షన్ లో ఆయన్ని వదిలేస్తే తన ఇంటికి వెళ్ళేందుకు కూడా దారి తెలియని మనిషి అని సెటైర్లు వేశారు. విజయవాడ అన్నారు, నరసారావుపేట అయిపోయింది. ఇపుడు విశాఖ నుంచి పోటీ అంటున్నాడు. అసలు 2024 తరువాత ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉంటాడో ఎవరికి ఎరుక అంటూ జీవీఎల్ మీద కౌంటర్లేశారు.

ఏపీకి బీజేపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన విభజన హామీలు ఇతర పధకాల విషయం చర్చించేందుకు నేను సిద్ధం. దానికి జీవీఎల్ బదులు చెబుతారా అని మంత్రి సవాల్ చేశారు. జీవీఎల్ విశాఖ ఎంపీ ఆశను ఆదిలోనే మంత్రి తుంచేశేలా కామెంట్స్ చేశారని అంటున్నారు. జగదాంబా జంక్షన్ నుంచి తన ఇంటికి దారి తెలియని ఎంపీ అంటూ వేసిన సెటైర్లు మాత్రం బాగానే గుచ్చుకున్నాయి. ఆ మాటకు వస్తే ఒక్క జీవీఎల్ ఏంటి విశాఖ మీద ఆశపడుతున్న చాలా మంది వలసదారులకు విశాఖ సిటీ ఎల్లలు తెలియవు అని అంటున్నారు.