విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాలకు డబ్బు జమ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కే కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఆర్కే రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యర్థులపై రోజా చెలరేగిపోయారు. పంచ్ డైలాగ్‌లతో ప్రత్యర్థులపై రోజా విరుచుకుపడుతుంటే, సీఎం జగన్ నవ్వుతూ కనిపించారు. ఈ సందర్భంగా ఇద్దరి కోసం స్పెషల్ పవర్స్‌ని వినియోగించాలని రోజా విన్నవించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆ ఇద్దరు మరెవరో కాదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఆయన దత్త పుత్రుడిగా వైసీపీ ముద్దుగా పిలుచుకునే పవన్‌కల్యాణ్. వాళ్లిద్దరికీ విద్యా దీవెన పథకం కింద లబ్ధి చేకూర్చాలని ఆమె సభా వేదికపై నుంచి సీఎంను కోరారు. ఆమె ఎలా అడగారంటే…
“జగన్ అన్నకు చిన్న రిక్వెస్ట్. అన్నా ఇన్ని లక్షల మందికి విద్యా దీవెన ఇస్తున్నాం. ఇంకో ఇద్దరికి కూడా విద్యా దీవెన ఇవ్వాలని కోరుకుంటున్నా. వాళ్లెవరో కాదు చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్. ఇంటర్లో తన గ్రూప్‌పై ఒక్కో సారి ఒక్కో విధంగా పవన్‌కల్యాణ్ చెప్పారు. ఒకసారి సీఈసీ, మరోసారి హెచ్ఈసీ, ఎంపీసీ అని చెప్పారు. చంద్రబాబేమో ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్లో బైపీసీ తీసుకోవాలని చెబుతున్నారు. వీళ్లిద్దరికీ విద్యా దీవెన వర్తింప జేద్దామంటే ఆంధ్రప్రదేశ్‌లో వాళ్లకు ఇల్లు లేదు. ఓటు లేదు. ఆధార్ కార్డు కూడా లేదు. ముఖ్యమంత్రికి కొన్ని ప్రత్యేక అధికారా లుంటాయి. ఆ పవర్స్‌ని ఉపయోగించి వాళ్లిద్దరికీ మంచి చదువు చెప్పించాలి” అని జగన్‌ను రోజా కోరారు.
వీళ్లంతా పిచ్చిపిచ్చి మాటలతో ఊగిపోతూ ఒకడు, జారిపోతూ ఒకడు, మరిచిపోతూ ఒకడు రాష్ట్ర ప్రజానీకాన్ని విసిగిస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. సినిమా డైలాగ్‌లతో ప్రత్యర్థులను ఓ రేంజ్లో రోజా ఆడుకోవడంతో ఆమె ప్రసంగం హైలెట్‌గా నిలిచింది. జగన్‌ను ఓడించాలన్నా, ఆడించాలన్నా ప్రత్యర్థి జగనే వుండాలని ఆమె తనదైన శైలిలో చెప్పారు.