హీరోల కొడుకులు హీరోలే అవుతారు. ఇండస్ట్రీ ఏదైనా కామన్ గా జరిగేది ఇదే. కానీ ఇక్కడ వ్యవహారం వేరు. ఓ స్టార్ హీరో కొడుకు, దర్శకుడిగా మారుతున్నాడు. ఆ హీరో మరెవరో కాదు, తమిళ స్టార్ నటుడు విజయ్. అతడి కొడుకు సంజయ్ దర్శకుడిగా మారాడు.
విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా మారాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా తీయబోతున్నాడు. ఈ సినిమాలో హీరో మాత్రం విజయ్ కాదు. హీరోహీరోయిన్లు ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తారు.
విజయ్ కొడుకు సంజయ్ తమ బ్యానర్ పై దర్శకుడిగా పరిచయమౌతున్న విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మాత సుభాస్కరన్ నిర్థారించారు. ఈ మేరకు సంజయ్ కు అగ్రిమెంట్ పత్రాలు అందిస్తున్న ఫొటోల్ని ఆయన షేర్ చేశాడు.
జాసన్ సంజయ్ విజయ్ చెన్నైలో తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. తర్వాత కెనడా వెళ్లి టొరంటో ఫిల్మ్ స్కూల్‌లో ఫిల్మ్ ప్రొడక్షన్ లో డిప్లొమా చేశాడు. ఆ తర్వాత లండన్‌లో స్క్రీన్ రైటింగ్‌లో (బీఏ ఆనర్స్) చదివాడు.
తన కొడుక్కి నటించడం కంటే డైరక్షన్ పై ఆసక్తి ఎక్కువని విజయ్ ఈమధ్య ప్రకటించాడు. అప్పట్నుంచి సంజయ్ డెబ్యూపై చర్చ సాగుతూనే ఉంది. ఎట్టకేలకు ఆ డిస్కషన్ కు ఈరోజు ఫుల్ స్టాప్ పడింది.
తనకు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చినందుకు 'లైకా'కు థ్యాంక్స్ చెప్పాడు సంజయ్. ఈ ప్రాజెక్టు కోసం కొంతమంది నటీనటులు, టెక్నీషియన్స్ తో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించాడు. లైకా అధినేతలు తనకు పూర్తిస్వేచ్ఛ ఇస్తున్నారని, ఓ మంచి చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తానని అంటున్నాడు స్టార్ హీరో విజయ్ తనయుడు సంజయ్.