ఈ మధ్య మెగా కాంపౌండ్ కు అస్సలు కాలం కలిసిరావట్లేదు. కూడబలుక్కొని అంతా వరుసపెట్టి ఫ్లాపుల మీద ఫ్లాపులిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి గాండీవధారి అర్జున కూడా చేరిపోయింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఫస్ట్ వీకెండ్ రన్ తో ఈ సినిమా రిజల్ట్ తేలిపోయింది.
రిలీజ్ రోజే గాండీవధారి అర్జునకు నెగెటివ్ టాక్ వచ్చేసింది. ఆ తర్వాత అది కాస్తా డిజాస్టర్ టాక్ గా మారింది. చివరికి కీలకమైన ఆదివారం నాడు కూడా ఈ సినిమా కోలుకోలేకపోయింది.
18 కోట్ల రూపాయల బ్రేక్-ఈవెన్ టార్గెట్ తో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అటుఇటుగా రెండున్నర కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది. కీలకమైన ఫస్ట్ వీకెండ్ ముగియడంతో, ఇక ఈ సినిమా కోలుకోవడం అసాధ్యమని ట్రేడ్ తేల్చేసింది.
ఆంధ్రా, నైజాం, సీడెడ్.. ఇలా ఏ ఏరియాలో ఈ సినిమాకు కోటి రూపాయల షేర్ దాటలేదు. అటు ఓవర్సీస్ లో సినిమా పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. కనీసం లక్ష డాలర్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. 86వేల డాలర్ల వసూళ్లతో ఈ సినిమా ఓవర్సీస్ లో భారీ డిజాస్టర్ గా నిలిచింది.
ఇవాళ్టి నుంచి వర్కింగ్ డేస్ మొదలయ్యాయి. ఇక ఈ వీకెండ్ ఖుషి సినిమా థియేటర్లలోకి వస్తోంది. సో.. గాండీవధారి అర్జున రన్ దాదాపు ముగిసినట్టే అనుకోవాలి. ప్రవీణ్ సత్తారు డైరక్ట్ చేసిన ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. సాక్షి వైద్య హీరోయిన్.