విపక్ష పార్టీల కూటమి ఇం.డి.యా.కి ఎంత మేర నష్టం జరుగుతుందో అనే అనుమానంతోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు గానీ.. మొత్తానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్లమెంటు ఎన్నికలు ముందుగానే వస్తాయని జోస్యం చెబుతున్నారు.
అయితే అలా జోస్యం చెప్పడానికి ఆమె చెబుతున్న కారణాలు మాత్రం చిత్రంగా ఉన్నాయి. డిసెంబరు నాటికి ప్రెవేటు హెలికాప్టర్లు అన్నీ కూడా బుకింగులు అయిపోయి ఉన్నాయిట. అంటే దేశంలో ఉన్న హెలికాప్టర్లు అన్నింటినీ ప్రచారానికి భాజపా వారే బుక్ చేసుకున్నారని, దాని అర్థం.. ముందస్తు ఎన్నికలేనని ఆమె అంచనా వేస్తున్నారు. ఇదేదో మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టే వ్యవహారం లాగా ఎవరికైనా అనిపిస్తే తప్పులేదు.
కానీ, ఇక్కడ మరో విషయం ఏంటంటే.. కనీసం ఇం.డి.యా. కూటమిని దెబ్బకొట్టడానికి, ఆ కూటమి మీద భయంతో ఎన్డీయే సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నదని ఆమె చెప్పి ఉంటే కాస్త నమ్మశక్యంగా ఉండేది. గత రెండు నెలలుగా మూడోసారి భేటీ కాబోతున్న ఈ ఇం.డి.యా. కూటమి ఇప్పటిదాకా సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడుకునే ధైర్యం కూడా లేకుండా.. కేవలం మోడీ మీద విమర్శలతోనే రోజులు నెట్టుకొస్తోంది.
సీట్లు సర్దుబాటు పర్వం మొదలైతే.. వీరిలో ఎన్ని లుకలుకలు పుట్టుకొస్తాయో ఎవ్వరికీ తెలియదు. ఈ నేపథ్యంలో.. ప్రతిపక్షాల కూటమి సర్దుబాట్లు పూర్తి చేసుకుని స్ట్రాంగుగా మారక ముందే.. ఎన్నికలు వస్తే వారికి నష్టం. ఆ వ్యూహంతో డిసెంబరులో ఎన్నికలు పెట్టబోతున్నారని చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఆమె హెలికాప్టర్లకు ముడిపెట్టి అంటున్నారు.
నిజం చెప్పాలంటే.. సీట్ల సర్దుబాటు పర్వం మొదలు కాగానే.. మమతా దీదీ వ్యవహారం కూడా ఇం.డి.యా. కూటమికి ముప్పుగానే మారుతుంది. ఆమె రాజ్యమేలుతున్న పశ్చిమబెంగాల్ లో సీపీఎం కూడా బలంగానే ఉంటుంది. ఆ సీపీఎం ఇం.డి.యా. కూటమిలో ఒక కీలక భాగస్వామి కూడా. అయితే.. సీపీఎంను మట్టి కరిపించి తాము పశ్చిమబెంగాల్ లో అధికారంలోకి వచ్చాం అని, బిజెపిని కూడా మట్టి కరిపిస్తామనం దీదీ ప్రతిజ్ఞలు చేస్తోంది.
తన రాష్ట్రంలో సీపీఎంకు సీట్లు పంచడానికి, వారితో కలిసి పోటీచేయడానికి ఆమె ఒప్పుకోదు. అలాంటి పని ఆమెకు ఆత్మహత్యా సదృశం అవుతుంది. అలాంటి నేపథ్యంలో ఆమె వ్యవహార సరళే కూటమికి ప్రమాదకరం అవుతుంది. మోడీ ముందస్తు ఎన్నికలకు రాబోతున్నారని ఊహాజనిత మాటలతో వారు ఏం సాధించగలరో గానీ.. దీదీ సర్దుబాటు ధోరణి నేర్చుకోకపోతే మాత్రం ఇం.డి.యా. కూటమికి ఇబ్బందేనని పలువురు అంచనా వేస్తున్నారు.