మెగా స్టార్ చిరంజీవి మాటలు కోటలు దాటతాయి. కానీ చేతలే అనుమానం. గతంలో ఓ ఫంక్షన్ లో చిరు శభాష్ అనిపించేలా మాట్లాడారు. ఆ ఫంక్షన్ నిర్మాత కేఎస్ రామారావు సినిమాకు సంబంధించినది. ఆ ఫంక్షన్ లో చిరంజీవి కెఎస్ రామారావు మీద బోలెడు సినిమా ప్రేమలు ఒలకబోసారు. అక్కడితో ఆగకుండా తన కుమారుడు రామ్ చరణ్ కు ఓ విన్నపం కూడా చేసారు. తన కోసం ఒక్క సినిమాను కెఎస్ రామారావుకు చేయమని కోరారు. ఒకప్పుడు కేఎస్ రామారావు చిరంజీవితో నిర్మించిన స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమా కారణంగానే ఆర్థికంగా కుదేలయ్యారు.
లక్కీగా వెంకటేష్ చంటి సినిమా కాస్త ఆదుకుంది. ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి ఇలాంటి అపీల్ చేయడం అందరినీ ఆనందింప చేసింది. కానీ ఈ రోజుకు కూడా రామ్ చరణ్ అలాంటి సినిమా చేసే ఆలోచన చేసినట్లు కానీ, చేస్తున్నట్లు కానీ లేదు. పోనీ అలా అని కేఎస్ రామారావు ప్రాజెక్టు తేవాలి కదా? అని అనడానికి లేదు. ఇప్పటి రోజుల్లో హీరోలే నేరుగా ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారు కనుక, చరణ్ తలుచుకుంటే కేఎస్ రామారావుతో సినిమా చేయడం అంత పెద్ద విషయం కాదు.
ఇక్కడ ఇంకో చిత్రమేమిటంటే, మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమాలు చేస్తున్నారు. ఆయనే నేరుగా కేఎస్ రామారావుకు సినిమా చేయవచ్చు కదా? కొడుకును ఓ సినిమా చేయమని కోరడం ఏమిటి? పైగా రామ్ చరణ్ తనకు బాబాయ్ నిర్మాణంలో సినిమా చేయాలని వుందని, అకీరాను హీరోగా తనే చేయాలని వుందని చెబుతున్నారు. కేఎస్ రామారావు ఊసేలేదు.
అరవింద్ సినిమా సంగతేమిటి?
ఇదిలావుంటే చిరు 151 లేదా 152వ సినిమా గీతా సంస్థే నిర్మిస్తుందని గతంలో అల్లు అరవింద్ సభా ముఖంగా అన్నారు. అప్పటికి 150 మాత్రమే పూర్తయింది. 151 వ సినిమా ను కూడా చరణ్ నే నిర్మించేసారు. 152 కూడా చరణ్ తన భాగస్వామ్యంలోనే నిర్మిస్తున్నారు. మరి అరవింద్ కు చిరంజీవి ఎప్పుడు సినిమా చేస్తారు అన్నది ప్రశ్న.
చిరంజీవి కెరీర్ ఉన్నత స్థాయికి వెళ్లడంలో గీతా సంస్థ పాత్ర కానీ, అల్లు అరవింద్ ప్లానింగ్ కానీ చాలా కీలకం. ఇది కాదనలేని విషయం. మరి అలాంటి వ్యక్తికి, సంస్థకు చిరంజీవి తన రీ ఎంట్రీ తరువాత సినిమా చేయకపోవడం ఏమిటో?