ఉరుములేని పిడుగులా డేట్ వేసారు ఆకాష్ పూరి రొమాంటిక్ సినిమా. అక్కడితో ఆగలేదు. నవంబర్ 4 నుంచి అక్టొబర్ 29కి లాక్కు వచ్చారు. అదీ సడెన్ గా. పట్టు మని పది రోజులు మిగలలేదు. కానీ సినిమా ఎలా వుంటుందన్న సంగతి పక్కన పెడితే, సినిమా మీద ఆసక్తిని మాత్రం అమాంతం పెంచేసారు.
ఇదంతా పూరి స్టామినా అని చెప్పుకోవాల్సిందే. తన స్టయిల్ లో రెండు ట్రయిలర్లు కట్ చేయడం, వరంగల్ లో భారీ ఫంక్షన్ చేయడంతో సినిమాకు బజ్ సర్రున వచ్చింది. ఒక విధంగా పూరి తనయుడు ఆకాష్ కు ఇది యాసిడ్ టెస్ట్.
ఇప్పటి వరకు సరైన లాంచ్ జరగలేదు. మెహబూబా మంచి సినిమానే అయినా ఇప్పటి మాదిరిగా సరైన ప్లానింగ్ జరగలేదు. పైగా సినిమా కూడా జనాలకు చేరలేదు.
ఇప్పుడు ఈ సినిమా విడుదల వరకు అంతా పెర్ ఫెక్ట్ గానే వుంది. ఇక సినిమా బాగుండడం, బాగా లేకపోవడం అన్న దాని మీదే ఆకాష్ కెరీర్ ఆధారపడి వుంది. గతంలో తన ఆస్తి అమ్మి మరీ పూరి తన తనయుడి కోసం సినిమా తీసారు.
ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ తరువాత తనకు మళ్లీ వచ్చిన స్టామినా మొత్తం వాడి ఈ సినిమా చేసారు. ఈ సినిమా సక్సెస్ అయి తీరాలి. లేదూ అంటే ఆకాష్ కోసం మళ్లీ ఇంత ప్రయత్నం పూరి చేయడం కష్టం అవుతుంది.