దిల్ రాజు తో మాటా..మాటా..ముచ్చట్లు

పండగ సినిమాల నేపథ్యంలో అందరి దృష్టి తనవైపు తిప్పుకున్న దిల్ రాజు ‘గ్రేట్ ఆంధ్ర’ తో మాట్లాడారు. ఇండస్ట్రీలో వున్న పలు విమర్శలు లేదా కామెంట్ లను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ…

పండగ సినిమాల నేపథ్యంలో అందరి దృష్టి తనవైపు తిప్పుకున్న దిల్ రాజు ‘గ్రేట్ ఆంధ్ర’ తో మాట్లాడారు. ఇండస్ట్రీలో వున్న పలు విమర్శలు లేదా కామెంట్ లను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ మాటా మంతీలో. మీడియా తన మీద రాస్తున్న కథనాల మీద తన అసంతృప్తిని, అభ్యంతరాలను దిల్ రాజు వ్యక్తం చేసారు. థియేటర్ల సమస్య అన్నది తనకు..అవతలి నిర్మాతలకు సంబంధించినది అని, మధ్యలో మూడో వ్యక్తులకు ఏం అవసరం అని అంటారు దిల్ రాజు. అంటే ఆయన దృష్టిలో ఈ సమస్యను మీడియా పట్టించుకోకూడదు అనా?

గిల్డ్ జనాలే తన వారసుడు సినిమా షూట్ ను చేసుకోమని అనుమతి ఇచ్చాయంటారు. వారసుడు సినిమా డబ్బింగ్ కాదని, పాన్ ఇండియా సినిమా అని కొత్త పాయింట్ తెరపైకి తెచ్చారు. ఇకపై ఏ సినిమా ఎప్పుడైనా వేసుకోవచ్చు అనే కొత్త వాదనను దిల్ రాజు ఈ విధంగా తెరపైకి తెచ్చారు.

అంతే కాదు. రోజులు మారాయని, అంతా గ్లోబల్ గా మారిందని, ఇకపై హీరోలు, దర్శకుల కోసం వేచి వుండక్కరలేదని, కథ వుంటే సినిమాలు అవే సెట్ అవుతాయని అంటారు.

మీడియా సంగతి సరే, ఇండస్ట్రీ జనాలు కూడా ఎందుకు మిమ్మల్ని విమర్శిస్తున్నారు అంటే కౌన్సిల్..ఎన్నికలు..సినిమాలు తీయని పాత సభ్యులు అంటారు. అసలు కౌన్సిల్ కు ఎన్నికలు ఎందుకు అన్నారు. కౌన్సిల్ బాడీలో మూడు వంతుల మంది సినిమాలు తీయని వారే అంటారు.

ఉప్పెన తరువాత కూడా మైత్రీ సినిమాలు మూడు చేసాను అంటారు. మరి రిస్క్ చేసి మరీ మైత్రీ ఎందుకు ఓన్ గా రంగంలోకి దిగింది అంటే రెండేళ్ల తరువాత తన విలువ వారికి తెలిసి వస్తుందంటారు. నిర్మాతలు అందరికీ డిస్ట్రిబ్యూటర్లు ఏదో తినేస్తున్నారు అని అనుమానం అంటారు.

ఉత్తరాంధ్రలో వున్న 35 థియేటర్లలో కొన్నయినా వీరయ్య, వీరసింహారెడ్డి లకు ఇస్తారా అంటే తన సినిమా వుంది కదా అన్నారు. అయితే మీ ధియేటర్లలో ఆ సినిమాలు వేయరన్నమాట అని క్లారిఫికేషన్ అడిగితే, అలా కాదు.. దగ్గర చేసి హైప్ చూసిన తరువాత చూడాలి అంటారు.

అందరికీ సెలవు డేట్ నే కావాలి. అందరికీ ప్రీమియమ్ థియేటర్లే కావాలంటే ఎలా అంటారు. పోనీ గిల్డ్ పెద్దగా మీరు కాస్త త్యాగం చేయవచ్చు కదా అంటే ‘మీరూ మీ సైట్ వేరే వాళ్లకు ఇచ్చేయండి’ అనే వింత వాదన చేస్తారు.

కార్తికేయ 2 టైమ్ లో హీరో నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్న వైనం గుర్తు చేస్తే పబ్లిసిటీ స్టంట్ ఏమో అంటారు. మళ్లీ వెంటనే దాన్ని డైవర్ట్ చేసి ఏదేదో చెప్పారు.

అదే సినిమాను వెనక్కు పంపాలనుకున్నపుడు ఒ మంత్రి గారు ఫోన్ చేసారన్న వార్తలు గుర్తు చేస్తే, ఎందుకు చేసారు. ఏం చెప్పారు అన్నది కాకుండా, తనకు మంచి మిత్రుడు అంటారు.

స్పైడర్, అజ్ఙాతవాసి ల వల్ల తాను గట్టిగా దెబ్బతిన్నా అంటూనే మహేష్ సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తా అంటారు.

చివరాఖరికి పండగ సినిమాల పోటీ గురించి దిల్ రాజు చెప్పేది ఏమిటంటే, దొరికినన్ని థియేటర్లలో సినిమా వేసుకోండి. ఏ సినిమా బాగుంటే ఆ సినిమాలకు విడుదల తరువాత థియేటర్లు అవే వస్తాయి అంటారు. ఇక్కడ అందరూ వ్యాపారమే చేస్తున్నపుడు తను ఎందుకు తన వ్యాపారం వదులుకుంటా అని కుండ బద్దలు కొడతారు.

అంటే మొత్తం మీద మెగాస్టార్ అయినా, నందమూరి బాలయ్య అయినా, వారసుడు సినిమా తో కిందా మీదా పడాల్సిందే అన్న క్లారిటీ వచ్చింది ఈ మాటా మాటాతో.