రాష్ట్రం నాలుగు నెలల క్రితం మునిగిపోయింది… ఇది టీడీపీ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్య. ఎంత ద్వేషపూరితంగా ఉందో చూడండి ఆయన మాట. ఆ మాటకు వస్తే ఆయన ఒక్కడివే కాదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మొదలు, యనమల రామకృష్ణుడు నుంచి అనేకమంది ఇలాంటి విషపూరిత ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి నాలుగు నెలలక్రితం తెలుగుదేశం ప్రజా ఉప్పెనలో మునిగిపోలా! కొట్టుకుపోయింది. ఆ విషయాన్ని వారు చెప్పలేక, ఇలా ద్వేషపూరితంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే ఎత్తిచూపడం ప్రతిపక్షం బాధ్యత. కాని వీరు చేస్తున్నదేమిటి? ఎంతసేపు రోదించడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు.
తాము అధికారంలో చేసిన నిర్వాకాలన్నిటిని సమర్థించుకోవడం, మరోవైపు ఇలాంటి ప్రేలాపలు సాగించడం.. ఇదే ప్రతిపక్షం కాదు.. వీరిమాటలు ఒక్కసారి చూస్తే వీరు ఎంత నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారో అర్థం అవుతుంది. చంద్రబాబు నువ్వు ఓడిపోవడం ఏమిటయా? అని కొందరు అంటే, అవును నేను ఇంత ఘోరంగా పరాజయం చెందడం ఏమిటి? ఇంతటి పరాభవమా? అని ఆయన ప్రశ్నించడం.. అంటే ప్రజల విజ్ఞతను వారు ప్రశ్నిస్తున్నారు. 2014లో తనకు ఓటు వేస్తే, ప్రజలంతా తన నాయకత్వంపై, విభజనకు, అన్యాయానికి గురైన రాష్ట్రానికి తాను అయితేనే న్యాయం చేస్తానని నమ్మారని అందుకే ఓటు వేశారని ఆయనకు ఆయనే గొప్పలు చెప్పుకుంటే, దేవినేని ఉమ, యనమల వంటివారు అవునవును అని డప్పుకొట్టేవారు.
మరి అదే ప్రజలు ఇప్పుడు జగన్‌కు ఓటు వేసి ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం మునిగిపోయిందట. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో చూడండి. అయ్యా.. ఉమగారు.. రాష్ట్రాన్ని మీరు ఐదేళ్లపాటు నిండా ముంచేశారని ప్రజలు నమ్మారు కాబట్టే మీతో సహా 152 మందిని ఓడించారు. 2014లో టీడీపీ గెలిచినప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ఆ పార్టీకి మద్య ఓట్ల తేడా కేవలం ఒకటిన్నర శాతం మాత్రమే. ప్రతిపక్షంగా ఆనాడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఒంటరిగా అరవైఏడు సీట్లు తెచ్చుకుంది. కాని టీడీపీకి బీజేపీ, జనసేన వంటి పార్టీలు మద్ధతు ఇచ్చారు. రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి జనాన్ని మాయచేస్తే కూడా టీడీపీకి భారీమెజార్టీ ఏమీరాలేదు. ఆ తర్వాత రుణమాఫీ పేరుతో అటు రైతులను, ఇటు రాష్ట్రాన్ని ముంచేశారన్న సంగతి వారికి అర్థం అయింది కాబట్టే టీడీపీని చిత్తు, చిత్తుగా ఓడించారు.
రాయలసీమలో ఏభై రెండు సీట్లకు గాను కేవలం మూడు సీట్లు వచ్చాయంటే దానర్థం అక్కడ పూర్తిగా టీడీపీ కొట్టుకుపోయిందనే కదా.. అసలు నాలుగు జిల్లాలలో ఒక్క సీటు కూడా టీడీపీ రాలేదంటే ఏమిటి అర్థం? మీరు రాష్ట్రాన్ని నిండా ముంచారనే. రాజధాని పేరుతో వేల ఎకరాల రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చి, మిగిలిన రాష్ట్రాన్ని ముంచేశారని ప్రజలు నమ్మారు. మూడులక్షల కోట్ల అప్పుతెచ్చి, ఏమిచేశారో తెలియకుండా ఖర్చుచేశారు కాబట్టే జనం అంతా మీరు రాష్ట్రాన్ని ముంచేశారని అర్థం చేసుకున్నారు. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు ఇలా అన్నీ తాత్కాలిక భవనాలకు వేలకోట్ల వ్యయం చేసి ప్రజల డబ్బును ఇష్టం వచ్చినట్లు దుబారా చేసి రాష్ట్రాన్ని ముంచేశారనే ప్రజలు టీడీపీకి ఓట్లు వేయలేదు.
హైదరాబాద్‌పై పదేళ్ల రాజధాని హక్కును వదలుకుని ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పట్టుబడి హుటాహుటిన విజయవాడ వెళ్లిపోయి ఆంధ్రుల పరువు నిండాముంచారనే జనం వీరికి ఓట్లు వేయలేదు. బోటు ప్రమాదానికి గురైతే దానిని జగన్ తీయలేకపోయారని ఉమా పిచ్చి వ్యాఖ్యలు చేశారు. మరి కృష్ణానదిలో ఉమా అనుచరులే అక్రమంగా బోట్లు నడిపి ప్రమాదానికి గురిచేస్తే ఎందుకు మాట్లాడలేదు. గోదావరి పుష్కరాలలో చంద్రబాబు కుటుంబం స్నానం ఆడడం కోసం సామాన్యులను గేటుబయట తొక్కిసలాటకు గురిచేసి ఇరవైతొమ్మిది మంది మరణానికి కారణమయ్యారే. అప్పుడు ప్రజలను గోదావరిలో ముంచింది ఎవరని అనుకోవాలి.
ప్రమాదం జరిగితే మానవ తప్పిదం. కాని పుష్కరాలలో జరిగిన విషాదం జరగడానికి కారణం ఎవరో ఉమాకు తెలిసినా తెలియనట్లు నటించవచ్చు. కాని ప్రజలు అందుకే ఉమాతో సహా అందరిని ఓడించి టీడీపీ వల్లే రాష్ట్రం మునిగిపోయిందని తేల్చిచెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ అంతా మునిగిపోయే పని ఏమిచేశారు? పోలవరంలో అవినీతి ఉందని తేల్చి 800 కోట్లు ఆదా చేసినందుకు మునిగినట్లా? వెలిగొండలో 60కోట్లు ఆదా చేసినందుకు మునిగినట్లా? రైతుభరోసా కింద రైతులకు 13,500 రూపాయలు ఇవ్వడం ద్వారా రైతులను ముంచినట్లా?
అగ్రిగోల్డ్ బాధితులకు 260 కోట్లు ఇవ్వడం ద్వారా వారిని ముంచినట్లా? ఆటో డ్రైవర్‌లకు చెప్పిన ప్రకారం పదివేల రూపాయల చొప్పున ఇవ్వడం వారిని ముంచినట్లా? నిజానికి జగన్ తాను చెప్పినవన్నీ చేసుకుపోతున్నారనే దుగ్ధతో ఇలాంటి పిచ్చివ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ ఏదైనా పెద్ద కార్యక్రమం చేస్తున్న తరుణంలో ఈ విపరీత వ్యాఖ్యలు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతిపక్షంగా విమర్శలు చేయడం తప్పుకాదు. కాని ద్వేషంతో చేస్తే వారికే నష్టం.
ఈ విషయం వారికి ఇప్పట్లో అర్థం అయ్యేలా లేదు. అందుకే తమ మీడియా ఉంది కదా అని, తమకు లైవ్ కవరేజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడితే నమ్మడానికి ప్రజలు అమాయకులు కారు. ఆ విషయం ఇప్పటికీ అర్థంకాకపోతే మునిగిపోయిన టీడీపీ ఇప్పట్లో పైకి తేలడం కష్టమే అవుతుందని చెప్పకతప్పదు.
-కొమ్మినేని శ్రీనివాసరావు