ఇసుక విధానంలో జగన్ తప్పు చేశారా..?

రాష్ట్రంలో ఇసుక కొరత, పెరిగిన రేట్లు, ఆగిపోయిన నిర్మాణాలు, భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలు.. ఏ పత్రిక చూసినా ఇవే వార్తలు, ఏ రాజకీయ పార్టీ చూసినా ఇసుక విధానంపైనే విమర్శలు. ఇవన్నీ…

రాష్ట్రంలో ఇసుక కొరత, పెరిగిన రేట్లు, ఆగిపోయిన నిర్మాణాలు, భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలు.. ఏ పత్రిక చూసినా ఇవే వార్తలు, ఏ రాజకీయ పార్టీ చూసినా ఇసుక విధానంపైనే విమర్శలు. ఇవన్నీ చూస్తుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పాలసీ మార్చి జగన్ తప్పు చేశారా అనే సందేహం రాకమానదు. ఇసుక పాలసీ విషయంలో జగన్ నిర్ణయం సరైనదే అయినా.. రాష్ట్రంలోని పరిస్థితులు దానిని పూర్తిగా ప్రభావితం చేశాయి. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనట్టుగా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్ట్ లు జలకళతో నిండిపోయాయి.

రాష్ట్రానికి మళ్లీ మంచిరోజులొచ్చాయని అనుకున్నారంతా. అయితే అదే సమయంలో ఇసుక లభ్యతకు కరువొచ్చింది. ఎక్కడికక్కడ నీరు నిండిపోవడంతో ఇసుక దొరకడం కష్టంగా మారింది. దీంతో సహజంగానే నిర్మాణ రంగం ప్రభావితమైంది, భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకడంలేదు. మరి ఇది వైసీపీ ప్రభుత్వ తప్పిదం ఎలా అవుతుంది. తప్పు జగన్ పై పడటానికి కారణం మధ్యలో ఇసుక విధానం మారడం.

గతంలో టీడీపీ ప్రభుత్వం ఇసుక సరఫరాను డ్వాక్రా మహిళలకు అప్పగించి, ర్యాంపుల వద్ద సీసీ టీవీల పర్యవేక్షణ పెట్టి ఓ ప్రయోగం చేసింది. అది కాస్తా వికటించడంతో వెంటనే ఇసుక ఉచితం అంటూ ప్రకటించింది. ఇసుకని ప్రభుత్వం అమ్మినా, ఉచితంగా ఇచ్చినా వినియోగదారుడికి పెద్దగా ఒరిగేదేమీ లేదు. మధ్యలో ఇసుక మాఫియానే బాగుపడుతుంది. జగన్ ఈ మాఫియాని అంతమొందించేందుకు ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన ఇసుక విధానం తెచ్చారు. పారదర్శకంగా ఆన్ లైన్లో ఇసుక కొనుగోళ్లకు అవకాశమిచ్చారు.

అయితే ఇసుక లభ్యత తక్కువగా ఉండటంతో జగన్ నిర్ణయం వెంటనే సత్ఫలితాలను ఇవ్వలేకపోయింది. పక్క రాష్ట్రాలకు అక్రమంగా ఇసుక తరలిపోవడాన్ని అధికారులు అడ్డుకోలేకపోతున్నారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అదే తప్పు జరిగింది, ఇప్పుడు జగన్ జమానాలో కూడా లారీలు సరిహద్దులు దాటేస్తున్నాయి. టీడీపీ హయాంలో నీటికి కరువుండేది కాబట్టి ఇసుక ఎక్కువగా దొరికేది. ఇప్పుడు జగన్ హయాంలో నీటి కరువు తీరిపోవడంతో ఆటేమేటిక్ గా ఇసుక లభ్యత తగ్గింది. దీంతో బ్లాక్ లో ఇసుక రేటు భారీగా పెరిగిపోయింది.

అప్పటికీ, ఇప్పటికీ పోల్చి చూస్తే నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే. అయితే దీనికి కారణం జగన్ తీసుకున్న నిర్ణయమా లేక, రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలి. మంత్రులు, సాక్షి మీడియా కూడా వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యారు. దీంతో టీడీపీ అనుకూల మీడియా రెచ్చిపోతోంది. భవన నిర్మాణ రంగం కుదేలైపోయిందని, 30 లక్షల మంది కార్మికులు రోడ్డునపడ్డారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని హడావిడి చేస్తోంది.

నదుల్లో నీటి ప్రవాహాలు తగ్గితే ఆటోమేటిగ్గా పరిస్థితులు చక్కపడతాయి. అప్పటి వరకూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఫలితం లేదు. ప్రతిపక్షాల విమర్శలు కాచుకోవడం, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం ఒక్కటే దారి. ఈ విషయంలో జగన్ ను నిందించడం అత్యుత్సాహమే అవుతుంది తప్ప, నిర్మాణాత్మకం అనిపించుకోదు.

అవును కాదు.. ఇది ఆవిరి.. ఎమోషన్ వేడి