మోడీ తుపాను-2019 మహారాష్ట్ర, హర్యానాల వద్ద బలహీన పడి తీరం దాటింది. సార్వత్రిక ఎన్నికలలో అది పెను తుపానే. దాని తాకిడికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ గింగిరాలు తిరిగింది. వటవృక్షాలు కూలిపోయాయి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా వున్న రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అమేధిలో పరాజయం పాలయ్యారు. కానీ సార్వత్రిక ఎన్నికల తర్వాత కొన్ని నెలల్లోనే జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వేగం తగ్గింది. మహరాష్ట్రలోనిది గెలుపే. కానీ సాదాసీదా గెలుపు. అది కూడా సొంతగా గెలిచిన గెలుపు కాదు. మిత్రపక్షం శివసేన సాయంతో గెలిచిన గెలుపు. జమిలి గెలుపు.
మహరాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన మొత్తం స్థానాలు:288. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన కనీససీట్లు:145. బీజేపీ- శివసేన కలసి సాధించిన వి:161. సాధారణ విజయమంటే, ప్రతిపక్షం కూడా బలంగా వున్నట్లే. ప్రధాన ప్రతిపక్షంగా ముందుకొచ్చిన ఎన్సీపీ-కాంగ్రెస్‌లకు వచ్చిన సీట్లు:102. పైపెచ్చు మోడీ- అమిత్ షాలు విస్తారంగా పర్యటించారు కూడా. ఏదైనా విజయం విజయమే కదా! ఈ నసుగుడు దేనికి? అని అనిపించవచ్చు. సార్వత్రిక ఎన్నికల దుమారంతో, ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో జరిగే ఎన్నికల్లో అదే దుమారం లేస్తుందని బీజేపీ ప్రచారం చేసుకున్నది. కడకు ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే ప్రభంజనాన్ని ఊహించాయి.
ఇక హర్యానాలో అయితే అది గెలుపూ కాదు. వోటమీ కాదు. అక్కడ ఏర్పడింది హంగ్; త్రిశంకు శాసనసభ. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన స్థానాలు : 90. సర్కారు ఏర్పాటు కావలసిన బలం: 46 సీట్లు. అనుమానం లేదు. ఇక్కడ కూడా బీజేపీ అతి పెద్ద పార్టీయే. కాకుంటే దాని బలం 40 సీట్ల దగ్గర ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టీకి 31 స్థానాలు వచ్చాయి. అంటే కాంగ్రెస్ కన్నా పది ఎక్కువే. సమస్య ఏమిటంటే, బీజేపీ వేగాన్ని కాంగ్రెస్ కొంత తగ్గిస్తే తగ్గించ వచ్చు కానీ, అంత పెద్ద మోడీ ప్రభంజనాన్ని, అరచెయ్యి అడ్డు పెట్టి ఆపిన వాడు 31యేళ్ళ యువకుడు.
పైగా అతడి పార్టీ కూడా ఇటీవలే అందరినోళ్ళలోనూ పడింది. ఆ పార్టీ పేరు జననాయక్ జనతా పార్టీ(జెజెపి). పెట్టి పదినెలలే అయ్యింది. అయినా, ఇలా 10 సీట్లను ఎగరేసుకు వెళ్ళిపోయింది. ఆ యువకుడి పేరే దుష్యంత్ చౌటాలా. ఇది కూడా పేరు మోసిన రాజకీయకుటుంబమే. దుష్యంత్ మాజీ ప్రధాని చౌదరి దేవీలాల్‌కు మునిమనుమడు. ఓం ప్రకాశ్ చౌటాలకు మనుమడు. కుటుంబ రాజకీయాలను చీదరించుకునే నరేంద్ర మోడీ-అమిత్ షాలకు ఇది మరీ చికాకు.
ఎన్నికలలో రాజకీయాలలో విజయమంటే, అధికారం పొందటమే కదా! కానీ బీజేపీకి ఇక్కడే చిన్న చిక్కొచ్చి పడింది. ఈ రెండు రాష్ట్రాలలో అధికారాన్ని పూర్తిగా పొందెయ్యటానికి వీలులేదు. మహరాష్ట్రలో అధికారాన్ని పంచుకోవాలి; హర్యానాలో అధికారాన్ని కాపాడుకోవాలి. నిజానికి బీజేపీకి నిఖార్సయిన మిత్రపక్షం ఏదయినా వుందీ- అది శివసేన. రెంటిదీ ఒకటే రంగు: కాషాయం. ఒకే హిందూత్వం. అంటే మిగిలిన పక్షాలకు హిందూత్వం లేదని కాదు. అవి హిందూత్వన్ని ఒక రాజకీయ సిధ్ధాంతంగా మలచుకోలేదు. కాబట్టి బీజేపీ-శివసేన ఏ రకంగా చూసినా ఒకే గూటి పక్షులు కావాలి.
చిత్రమేమిటంటే, ఒకే పక్షాలే ఒకే గూటిలోవుండటానికి నిత్యమూ కొట్లాడుకుంటాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలలో, శివసేనను ఎన్నికలకు ముందే బీజేపీ కుదించే ప్రయత్నం చేసింది. పొత్తులో భాగంగా పోటీ పెట్టటానికి అడిగినన్ని సీట్ల కంటె బాగా తక్కువ ఇచ్చింది. ఆ తక్కువనే తీసుకున్ని ఎక్కువ సత్తా చూపింది శివసేన. శివసేనతో సంబంధంలేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి వెళ్ళి, శివసేనను నామమాత్రపు మిత్రపక్షంగా వుంచాలని బీజేపీ చూసింది. (ఇప్పుడు కేంద్రంలో బీజేపీ మిత్రపక్షాల స్థితి అదే కదా!) ఇప్పుడు పరిస్థితి తిరగబడింది.
బీజేపీకి 105 వస్తే, శివసేనకు 56 సీట్లు వచ్చాయి. కాబట్టి శివసేన మద్దతు సర్కారు ఏర్పాటు చెయ్యటానికే కాదు, పాలన కొనసాగించటానికి కూడా అనివార్యం. అ పరిస్థితి గమనించే, శివసేనాని ఉధ్ధవ్ థాకరే ఫలితాల సరళి చూడగానే 'అధికారాన్ని చెరిసగం' పంచుకుందామని ప్రతిపాదించారు. అంటే ముఖ్యమంత్రి పదవిని సగం పదవీ కాలం పాటు బీజేపీ, మిగతా సగంకాలం శివసేన- అనే ఫార్ములాను ముందుకు తెచ్చారు. అలా చూసినప్పుడు బీజేపీకి మహారాష్ట్రలో గెలుపు సగం గెలుపే అవుతుంది.
సంకీర్ణానికి మోడీ- షాలు కేంద్రంలో తెరదించినా, రాష్ట్రాలలో దించలేక పోతున్నారని చెప్పటానికి ఇదొక ఉదాహరణ. ఇక హర్యానాలో యధావిధిగా బొటా బొటి మెజారిటీతో బీజేపీ కుస్తీ పడుతోంది. మళ్ళీ మోహన్ లాల్ కట్టరే ముఖ్యమంత్రిగా బీజేపీ సర్కారును ఏర్పాటు చెయ్యటానికి ఉవ్విళ్ళూరుతున్నారు. మరి తక్కువయిన అరడజను సీట్లూ ఎక్కడి నుంచి పూడ్చుకుంటారు? ఇండిపెండెంట్లనుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ స్వతంత్రులంటే, సాదా సీదా స్వతంత్రులు కారు.
బీజేపీలో టికెట్ నాశించి, భంగపడి, 'రెబెల్స్'గా పోటీకి దిగారు. వారిని ఇప్పటికే నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక పక్క 'కింగ్ మేకర్'గా అవతరించిన జెజెపి పార్టీనేత దుష్యంత్ చౌటాలా పది సీట్లతో సిధ్ధంగా వున్నారు. కానీ బీజేపీకే ఇస్తానని కాదు. బీజేపీకీ, కాంగ్రెస్ కీ సమదూరాన్ని పాటిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌కు వచ్చిన 31 స్థానాలకు, ఈ పది కలిపినా, సర్కారు ఏర్పాటుకు సరిపోవు. అలా చెయ్యాలనుకుంటే స్వతంత్రులే కీలకమవుతారు. ఒకవేళ స్వతంత్రులు జెజెపి వైపు మళ్ళితే, కర్ణాటకలో నిన్నమొన్నటి వరకూ హెచ్.డి.కుమార స్వామి చక్రం తిప్పినట్లు తిప్పగలుగుతారు.
ఏది ఏమయినా బీజేపీ 'హిందూత్వ' పాచిక ఈ సారి పెద్దగా పారినట్లు లేదు. కాశ్మీరులో 370 అధికరణం రద్దు కానీ, పాకిస్తాన్ కు ఇచ్చిన యుధ్ధహెచ్చరికలు కానీ ఈ రెండు రాష్ట్రాల్లో పనిచెయ్యలేదు.