ఇప్పటికే రెండు సార్లు హీరోయిన్ అనన్య పాండేను విచారించారు ఎన్సీబీ అధికారులు. ఇప్పుడు ఆమెకు మరోసారి నోటీసులు జారీచేశారు. ఆమె ఈ వారంలోనే మరోసారి విచారణ కోసం ఎన్సీబీ ఆఫీస్ కు రాబోతోంది.
లెక్కప్రకారం నిన్న ఆమె ఎన్సీబీ విచారణకు రావాలి. కానీ తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో విచారణకు హాజరుకాలేకపోతున్నట్టు అనన్య పాండే, ఎన్సీబీకి సందేశం అందించింది. దీన్ని అంగీకరించిన అధికారులు, ఆమెకు ఫ్రెష్ గా మరోసారి నోటీసులు జారీచేశారు. అదే టైమ్ లో ఎన్సీబీ జోనల్ డైరక్టర్ సమీర్ వాంఖడే కూడా ముంబయిలో లేరు. ఆయన ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లారు.
ముంబయి క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ టైమ్ లో ఆర్యన్ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. అందులో అనన్య పాండేతో అతడు జరిపిన వాట్సాప్ ఛాట్స్ గుర్తించారు. ఆ ఛాటింగ్స్ లో డ్రగ్స్ ప్రస్తావన ఉండడంతో అనన్య పాండే ఇంట్లో సోదాలు నిర్వహించడంతో పాటు, ఆమెను ఇలా దశలవారీగా విచారిస్తున్నారు.
ఆర్యన్ ఖాన్ తో డ్రగ్స్ కు సంబంధించి తను కేవలం జోక్ చేసినట్టు అనన్య పాండే, ఎన్సీబీ అధికారులకు వెల్లడించింది. మాల్ ఉందా అని ఆర్యన్ అడిగితే, ఇంటికి రా ఎరేంజ్ చేస్తా అని తను సరదాగా రిప్లయ్ పెట్టినట్టు చెప్పుకొచ్చింది. అంతకుమించి తనకేం తెలియదంటూ ఆమె ఎన్సీబీ అధికారుల ఎదుట ఏడ్చినంత పని చేసింది.
మరోవైపు ఆర్యన్ బెయిల్ కు సంబంధించి ఈరోజు బాంబే హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే 3 సార్లు ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై విచారించిన సెషన్స్ కోర్టు.. ఈనెల 30 వరకు రిమాండ్ విధించింది. ఇప్పుడీ వ్యవహారం మరోసారి కోర్టు ముందుకొచ్చింది. ఈరోజు కచ్చితంగా ఆర్యన్ కు బెయిల్ వస్తుందంటున్నారు అతడి తరఫు న్యాయవాదులు.