కురుక్షేత్ర యుద్ధంలో రెండు సారధ్యాల గురించి ప్రత్యేకంగా చెప్తారు. ఒకటి – కృష్ణ సారధ్యం, రెండు- శల్య సారధ్యం.
కృష్ణసారధ్యం ఋజుమార్గం చూపడానికి, పరువు నిలబెట్టడానికి, విజయం అందించడానికి ప్రతీక.
శల్యసారధ్యం తప్పుడు మార్గంలోకి నెట్టడానికి, పరువు తీయడానికి, అపజయం తెచ్చిపెట్టడానికి ప్రతీక.
మొదటి దానివల్ల అర్జునుడు విజయం సాధించాడు. రెండో దానివల్ల కర్ణుడు నేలకొరిగాడు.
చంద్రబాబు అర్జునుడైతే ఆ పత్రిక యజమాని కృష్ణుడా? లేక చంద్రబాబు కర్ణుడైతే ఆ పత్రిక యజమాని శల్యుడా? ఈ విషయంలో ఇన్నాళ్లూ చాలామందికి అనుమానాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ఇక్కడ ఆ విషయాన్ని చర్చించుకుందాం.
ఈ రోజు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రభుత్వం తమపై ఎలాంటి దాడులు చేస్తోందో రాష్ట్రపతికి గోడు వెళ్లబోసుకున్నారు.
ఆ వార్తకి ఆ పత్రిక పెట్టిన హెడింగులు ఇవి:
– ఉగ్రరూపంతో రాష్ట్రపతి భవన్ కి చేరుకున్న చంద్రబాబు
– చంద్రబాబు ఆట మొదలైంది
– సింహంలా ఢిల్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు
– ఏపీలో పరిస్థితిపై రాష్ట్రపతి సీరియస్
– అమరావతి రాజధాని ఏమైంది అని రాష్ట్రపతి చంద్రబాబుకి ప్రశ్న
అసలే దయనీయ స్థితిలో ఉన్న చంద్రబాబుని సింహం అని, ఉగ్రనరసింహం అని డప్పుకొడుతూ హెడింగులు ఎవరికోసం పెట్టినట్టు?
చంద్రబాబుని సంతుష్టపరచడానికా? లేక క్యాడర్ కి పౌరుషం తెప్పించడానికా? లేక కార్యకర్తలకి ఉత్సాహం తెప్పించడానికా?
ఇవన్నీ పత్రిక యజమానికి తెలిసే జరుగుతున్నాయా? లేక ఎవరో అత్యుత్సాహవంతుడైన జర్నలిస్టుకి అప్పజెప్పేసి కూర్చున్నారా?
ఆ పత్రికని తెదేపా కి కరపత్రం అంటే కాస్తైనా భిన్నవాదనుండేది. ఎంతో కొంత పాత్రికేయపద్ధతి ఉండేది. అసలిప్పుడు అసలు సిసలు కరపత్రంలా ఉందని చెప్పడానికి ఈ హెడ్డింగులే నిదర్శనం.
రాష్ట్రంలోనే కాదు పక్కరాష్ట్రమైన తెలంగాణాలో కూడా నవ్వుకుంటున్నారు ఈ లైన్లు చూసి.
చంద్రబాబు నిజంగా అత్యధిక మెజారిటీతో తొడగొట్టి గెలిచి 150/175 లాంటి స్కోరొచ్చినప్పుడు ఇంతకంటే ఘనమైన హెడ్డింగులు పెట్టినా అతుకుతాయి. ఆఫీసుల్లో దీక్షాశిబిరాల్లో అరవాడనికి తప్పించి జనాదరణతో లేచి నిలబడడానికి పార్టీలో ఏమాత్రం ఓపిక లేని తరుణంలో ఈ రేంజ్ హెడ్డింగులు పెట్టి చంద్రబాబు పరువుని అభాసుపాలు చేసింది ఆంధ్రజ్యోతి.
ఇవి పొగడ్తల్లా లేవు ఎగస్పార్టీవాళ్లు చేసే వెక్కిరింతల్లా ఉన్నాయి.
గతంలోకి తొంగి చూస్తే ఇదే పత్రిక ఒక గొప్ప విషయాన్ని తెలియజేసింది. అప్పట్లో గుజరాతులో ఏదో కార్యక్రమానికి చంద్రబాబు వెళ్లి పెన్నో, పువ్వో కింద పారేసి దానిని వంగి తీసే నెపంతో మోదీగారి కాళ్లుపట్టుకున్నారని, అయినా మోదీ కనికరించలేదని సారాంశం. ఇంతకంటే పరువుతక్కువ రాతుంటుందా?
మొన్నటికి మొన్న వల్లభనేని వంశీ లోకేష్ గురించి ఆయన తల్లిగారి గురించి ఏదో అనకూడని విధంగా అంటే వైసీపీ సానుకూల పత్రికలు కూడా దాని గురించి రాయడానికి ఇష్టపడలేదు. తల్లి ఎవరికైనా తల్లే అనే ధర్మాన్ని పాటించి ఆ వార్తకి అస్సలు ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ ఇదే పత్రిక వారు తగుదునమ్మా అంటూ ఆ వార్తని కవర్ చేసారు వారాంత వ్యాసంలో. ఇదెక్కడి అన్యాయం. వదిలేస్తే శూన్యంలో కలిసిపోయే ఒక అసహ్యకరమైన వార్తని మెయిన్ స్ట్రీం మీడియాలో ప్రచురించి వదిలితే అది చరిత్రలో నిలిచిపోదూ! ఇలాంటి రాతలతో చంద్రబాబుకే కాదు ఆయన కుటుంబ సభ్యుల పరువు కూడా తీయడం ఎంత దారుణం?!
ఓదార్పు పేరుతోనో, సంఘీభావం నెపంతోనో, ఎదురుదాడి ముసుగులోనో తెదేపాకి ఆదినుంచీ శల్యసారధ్యం వహిస్తున్న పత్రిక ఏదైనా ఉందా అంటే అది ఈ పత్రికే.
ఎక్కడో ఏదో జరిగిన పరువుతక్కువ విషయాన్ని, ఎవరో ఏ సందులోనో అన్న బూతు మాటని తీసుకొచ్చి పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చు వేసి చదివించడం ఎంత ప్రమాదకరమో అసలు అర్థమౌతోందా?
ఇలాంటి చర్యలవల్ల తెదేపాకి కోలుకోలేనంత దెబ్బని కొట్టి లేవలేనంత లోతుకి గొయ్యి తవ్వుతోంది ఈ పత్రిక. ఈ రోజు ఈ హెడ్డింగుల విషయంలో ఎగస్పార్టీ వారి ట్రోలింగులే కాదు, స్వయానా తెదేపా కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తపరిచారన్న సంగతి తెలుసుకోవల్సినవారు తెలుసుకుంటే వారికే మంచిది.
హరిగోపాల్ సూరపనేని