కంటెంట్ ఎలా ఉంటుందనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తేలుతుంది. కానీ ఈలోగా ఎంత సంచలనం సృష్టించాలో అంతా చేస్తున్నాడు ఆర్జీవీ. తన సినిమాలకు ప్రమోషన్ ఇవ్వడంతో ఆరితేరిపోయిన ఈ దర్శకుడు.. ఈసారి కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే ట్రయిలర్ తో అందర్నీ పిచ్చెక్కించాడు. దీపావళి కానుకగా విడుదలైన ఈ ట్రయిలర్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ ప్రముఖులంతా ఉన్నారు.
మొన్నటివరకు చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసిన వర్మ, ఈసారి తన లేటెస్ట్ మూవీలో అందర్నీ టచ్ చేశాడు. బాబుతో పాటు జగన్, పవన్ పాత్రల్ని కూడా పెట్టాడు. వీళ్లతో పాటు కేఏపాల్, నారాలోకేష్ పాత్రల్ని కూడా ఉంచాడు. అంతెందుకు.. చివరికి బ్రాహ్మణి పాత్రకు కూడా చోటిచ్చాడు. పనిలోపనిగా ట్రయిలర్ కు ఫినిషింగ్ టచ్ అన్నట్టు మోడీ, అమిత్ షా పాత్రల్ని కూడా చూపించి ఆసక్తిని రెట్టింపు చేశాడు.
గత ఎన్నికలకు ముందు జరిగిన రాజకీయ పరిణామాల నుంచి సినిమాను స్టార్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. కథను ఎక్కడ ముగించాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. దీంతోపాటు ఆ దేవుడే నన్ను వెన్నుపోటు పొడిచాడమ్మా అంటూ బాబు పాత్రధారి చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఇవన్నీ ఒకెత్తయితే… ఏడుస్తూ అన్నం తింటున్న కొడుకు లోకేష్ దగ్గరకొచ్చి చంద్రబాబు ''పప్పు'' వడ్డించే సన్నివేశం టోటల్ ట్రయిలర్ కే హైలెట్ గా నిలిచింది.
ప్రతి పాత్రకు వర్మ ఎంచుకున్న నటులు సరిగ్గా సరిపోయారు. మరీ ముఖ్యంగా లోకేష్, చంద్రబాబు, పవన్ పాత్రధారులు భలే సింక్ అయ్యారు. ధన్ రాజ్, బ్రహ్మానందం, అలీ, కత్తి మహేష్ పోషించిన పాత్రలు ఎవరివనేది సినిమా రిలీజ్ తర్వాత తెలుస్తుంది.
మొత్తమ్మీద వర్మ అనుకున్నది చేశాడు. గత ఎన్నికల టైమ్ లో జరిగిన తెలుగు రాజకీయాల్ని పూర్తిస్థాయిలో వెండితెరపై ఆవిష్కరిస్తానని చెప్పిన ఆర్జీవీ, అన్నంత పనిచేశాడు. అయితే కేవలం ట్రయిలర్ చూసి వర్మ సినిమాలపై అంచనాలు పెంచుకోలేం. అలా అంచనాలు పెట్టుకుంటే ఏమౌతుందో, అతడి గత చిత్రాలు చాలానే నిరూపించాయి.
సో.. ఈ కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా హైప్ కేవలం ట్రయిలర్ కే పరిమితమా.. థియేటర్లలో కూడా మోత మోగిస్తుందా అనేది చూడాలి.