ప్రభుత్వ తీరును భూతద్దంలో చూస్తోన్న పచ్చనేతలు
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను వెతికే పనిలో తెలుగు తమ్ముళ్ళు తలమునకలయ్యారు. ప్రస్తుతం పచ్చనేతలు వైకాపా ప్రభుత్వ లోపాల కోసం కాగడా పట్టి మరీ గాలిస్తున్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వంపై చెప్పుకోదగిన ఆరోపణలేవీ లేవని, ఇందుకు సంబంధించి ప్రజల్లో చర్చ జరగడం లేదన్నది కొంతమంది దేశంనేతల వాదన! అయితే తెలుగుదేశం ప్రభుత్వంతో పోల్చిచూస్తే విద్యుత్ సరఫరా విషయంలో ప్రస్తుత ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, ఇసుక అందుబాటులో లేక వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారంటూ మెజారిటీ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఈ రెండు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడంలో మాత్రం సదరునేతలు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలను గమనించాలని, వైఫల్యాలను ఎప్పటికపుడు ప్రజలకు వివరించాలంటూ టీడీపీ అధిష్ఠానం నుండి ఆదేశాలందడంతో ఇపుడు ఆ దిశగా పచ్చనేతలు దృష్టి సారించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను నిశితంగా పరిశీలించడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలును నిశితంగా పరిశీలిస్తున్నారు.
జగన్ ప్రభుత్వం రాగానే తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాల పేర్లు, రంగులను మార్చేశారు. కొన్ని పథకాలను రద్దుచేశారు. అన్న కేంటీన్లను రద్దుచేసిన వైకాపా ప్రభుత్వంపై తెలుగు తమ్ముళ్ళు విరుచుకుపడ్డారు. అయితే త్వరలో అన్న కేంటీన్లను ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పున:ప్రారంభిస్తామని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మరికొన్ని గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలకు వైకాపా మంగళం పాడింది. ఏటా సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ సమయాల్లో చంద్రన్న కానుకలను టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన విషయం తెలిసిందే!
జగన్ ప్రభుత్వంలో ఈ కానుకల విషయం ఏమిటన్న విషయమై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయదలచిన పక్షంలో వచ్చే డిసెంబర్‌లో క్రిస్మస్ కానుక పంపిణీకి ఇప్పటి నుండే ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ డిపోల ద్వారా కిట్ల రూపంలో చంద్రన్న కానుకను అందించింది. ఈ పథకానికి జనం నుండి మంచి ఆదరణ లభించింది. జగన్ ప్రభుత్వం సైతం చంద్రన్న కానుక పథకాన్ని పేరు మార్చి అమలుచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ కానుకలను యథా ప్రకారం కొనసాగిస్తారని వైకాపా నేతలు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకువేసి ఉగాది పర్వదినం నాటికి జనాదరణకు నోచుకునే వివిధ పథకాలను ప్రారంభించే అవకాశాలున్నట్టు సదరు నేతలు పేర్కొంటున్నారు. ఉగాది సందర్భంగా పేదలందరికీ పక్కాగృహాలు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఈ పరిణామాన్ని టీడీపీ నేతలు నిశతంగా గమనిస్తున్నారు.
తెలుగుదేశం హయాంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో గృహ నిర్మాణం, రహదారుల ఏర్పాటు, పర్యాటక రంగాభివృద్ధికి పెద్దఎత్తున నిధులు మంజూరైన విషయం తెలిసిందే! కేంద్రం నిధులతో తెలుగుదేశం నేతలు షోకులు చేసుకుంటున్నారని, సొమ్ము కేంద్రానికి, సోకు రాష్ట్రానిదా? అంటూ గతంలో బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇపుడు వైకాపా ప్రభుత్వం సైతం కేంద్రం నిధులను పెద్దఎత్తున వివిధ సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించేందుకు రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో కమలనాధుల వైఖరి ఏ విధంగా ఉంటుందో వేచిచూడాల్సిందేనని పలువురు చర్చించుకుంటున్నారు.