మీకు తెలుసా.. విజయవాడలో వీరభద్రస్వామి ఆలయం చాలా ఫేమస్. నగరం మొత్తానికి క్షేత్రపాలకుడిగా అతడ్ని కొలుస్తారు. క్రీస్తుశకం 4వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. అత్యంత ప్రాచీన ఆలయం ఇది. పోనీ.. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న విజయేశ్వరస్వామి ఆలయం ఎక్కడుందో తెలుసా? పోనీ.. ప్రకాశం బ్యారేజీ దగ్గర్లో పురాతన పాతళ వినాయకుని ఆలయం మీకు తెలుసా? మన సంస్కృతితో పాటు చరిత్రను తెలియజెప్పే ఇలాంటి ఆలయాల్ని దర్శించాలనుకుంటున్నారా? అయితే మీకు ఆ దర్శన భాగ్యంలేదు. ఎందుకంటే చంద్రబాబు వీటిని ఆల్రెడీ కూల్చేశారు.
అవును.. ఇవి మాత్రమే కాదు, ప్రసిద్ధ శిరిడీసాయి ఆలయం, శంకరమఠం, ఆంజనేయస్వామి ఆలయం.. ఇలా పదుల సంఖ్యలో దేవాలయాల్ని చంద్రబాబు నేలమట్టం చేశారు. ఏపీ తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించిన తర్వాత బాబు చేసిన పనులివి. ట్రాఫిక్ కు అడ్డం వస్తున్నాయని ఇష్టారాజ్యంగా ఇలాంటి పురాతన ఆలయాల్ని పదుల సంఖ్యలో కూల్చేశారు. ఇప్పుడు వీటిపై ముఖ్యమంత్రి జగన్ దృష్టిపెట్టారు. ప్రజల సెంటిమెంట్, సంస్కృతితో ముడిపడిన ఈ ఆలయాల్ని పునర్ నిర్మించాలనుకుంటున్నారు జగన్.
ట్రాఫిక్ కు ఇబ్బందిగా ఉన్నాయనే నెపంతో కూల్చివేసిన ఈ ఆలయాల్ని అదే ప్రదేశంలో మళ్లీ నిర్మించాలని జగన్ సర్కార్ యోచిస్తోంది. కుదరని పక్షంలో వేరే ప్రాంతంలో ఈ ఆలయాల్ని ప్రతిష్టించాలని నిర్ణయించింది. గతంలో ఆ ఆలయాలు ఎలా ఉండేవో అదే రూపంలో తిరిగి ప్రాణప్రతిష్ట చేయాలని అనుకుంటున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై బెజవాడ ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఆలయాలు పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్రం ప్రకటించే గ్రాంట్ నుంచి పొందేందుకు కృషి చేస్తోంది జగన్ ప్రభుత్వం.
స్వదేశీ దర్శన్ పేరిట ఆలయాల పునరుద్ధరణ కోసం కేంద్రం ప్రత్యేక గ్రాంట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికోసం మోడీ సర్కార్ బడ్జెట్ కేటాయింపులు కూడా చేసింది. ఈ పథకం కింద విజయవాడలో నేలమట్టమైన ఆలయాల్ని తిరిగి నిర్మించాలనేది జగన్ ఆలోచన. ఇందుకోసం 900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు హయాంలో జరిగిన అరాచకం అంతా ఇంతా కాదు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడమే కాకుండా.. ఇలా సాంస్కృతిక వారసత్వాన్ని కూడా భావితరాలకు అందకుండా చేశారు.
దీనికితోడు విచ్చలవిడి అవినీతి. ఇలా పూర్తిగా నిర్వీర్యమైన వ్యవస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా గాడిలో పెడుతున్నారు జగన్. అదే క్రమంలో ఆలయాల్ని కూడా పునర్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ బృహత్ కార్యానికి కేంద్రం నుంచి ఎంత సహకారం లభిస్తుందనేది తేలాల్సి ఉంది.