ఒకవైపు వీకెండ్స్ లో హైదరాబాద్ చేరుకుంటున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. కార్పొరేట్ ఉద్యోగి స్టైల్లో శుక్రవారం వరకూ రాజకీయాలు, శని-ఆదివారాలు కుటుంబంతో గడపడానికి హైదరాబాద్! గతంలో జగన్ ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో ఉంటే తెలుగుదేశం పార్టీ ఎన్నిమాటలు అందో అందరికీ గుర్తే. అయితే చంద్రబాబు కుటుంబం అప్పుడూ హైదరాబాద్ లోనే ఉండింది, ఇప్పుడూ అక్కడే ఉంది!
ఎంతైనా అది చంద్రబాబు నాయుడు కట్టిన నగరం కాబట్టి అక్కడే ఉండే రైట్ ఉందని అంటారు కాబోలు! అలా వీకెండ్ పాలిటిక్స్ సాగిస్తున్న చంద్రబాబు నాయుడు.. త్వరలోనే ఏపీలో జిల్లాల పర్యటనకూ బయల్దేరబోతున్నారట. రాబోయే రెండునెలల్లో వివిధ జిల్లాలకు చంద్రబాబు నాయుడు వెళ్లబోతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. షెడ్యూల్ కూడా ప్రకటించేసింది!
జగన్ పాలన గురించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు అవసరానికి మించి మాట్లాడుతూ ఉన్నారు. అనుచితమైన మాటలు మాట్లాడటానికి కూడా ఆయన వెనుకాడం లేదు. ఏవో ఎన్నికలు వచ్చేస్తుంటే హీటు పెంచే మాటలు మాట్లాడటం అదో వ్యూహం.
అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చే లీకుల్లోనే తీవ్రమైన పదజాలాన్ని వదలుతున్నారు. ఇప్పటి నుంచి ఇలా మాట్లాడితే.. ఎన్నికల నాటికి ఇంకెలా మాట్లాడాలో! అలాగే ఇప్పటి నుంచి వరసగా జిల్లాలను చుట్టేయడం మొదలుపెడితే, వచ్చే ఎన్నికల నాటికి దేశమంతా తిరగేయాలి. అయితే తమది జాతీయ పార్టీ కాదు చంద్రబాబు గారూ! అని అంటున్నారు పరిశీలకులు.