లోక్‌సభ ఎన్నికల్లో వన్ సైడెడ్ ఫలితాలు వచ్చాకా పలు రాజకీయ పార్టీలు ఈవీఎంల మీద బోలెడన్ని అనుమానాలు వ్యక్తం చేశాయి. వారి అనుమానాలు కేవలం ఓడిపోయామనే అక్కసుతోనే అని వేరే చెప్పనక్కర్లేదు కూడా. ఒకవేళ ఆ ఎన్నికల్లో వారే గనుక గెలిచి ఉంటే.. కచ్చితంగా ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేసేవాళ్లు కాదు. ఓడిపోయారు కాబట్టే ఈవీఎంల మీద అనుమానాలు. ఈవీఎంల మీదే జరిగిన ఎన్నికల్లో వారు గెలిచినప్పుడు అవి మంచివి అయ్యాయి. తాము ఓడిపోయాం కాబట్టి.. నెపాన్ని ఈవీఎంల మీద నెట్టేసి ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా కొంతమంది రాజకీయ నేతలు మాట్లాడారు.
కనీసం ఎన్నికల ఫలితాలు రాకముందే వారు వాటి మీద కామెంట్లు మొదలుపెట్టారు. ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని అన్నారు. ఓటమిని ముందే అంచనా వేసి వారు ఆ మాటలు మాట్లాడారు అనేది సత్యం. వారు అలాంటి అనుమానాలు రేకెత్తించి ప్రజల్లో ఏ మూలో కొందరిలో అనుమానాలను రేకెత్తించి ఉండవచ్చు గాక. అయితే తాజాగా రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలించాకా ఈవీఎంల మీద అనుమానాలు పటాపంచలు అయినట్టే.
ఒకవేళ ఈవీఎంలను ట్యాంపర్ చేసి ఎన్నికలను గెలవగలిగే విధానమే ఉంటే.. భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర, హరియాణాల్లో మరిన్ని సీట్లను సంపాదించడం పెద్ద కథ కాదు. లోక్‌సభ ఎన్నికలే వారు ఈవీఎంలను ట్యాంపర్ చేసి ఉంటే.. అసెంబ్లీ ఎన్నికలకు మరింత ఛాన్స్ ఉండేది. అయితే మహారాష్ట్ర, హర్యాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరీ అంత సానుకూల ఫలితాలను పొందలేదు. కాంగ్రెస్ పార్టీ నిస్తేజమైన స్థితిలో ఉండి కూడా.. భారతీయ జనతా పార్టీకి గట్టి సమాధానం ఇచ్చింది.
మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీలు మంచి స్థాయిలో సీట్లను పొందాయి. హరియాణాలో హంగ్ వచ్చింది. హంగ్ వచ్చేలా ఈవీఎంలను సెట్ చేయాలని అది చేతనైన వారు కూడా అనుకోరు కదా. సాధ్యమే అయితే ఫలితాలను తమకు అనుకూలంగా ఈవీఎంలను మార్చుకునే వారేమో. కానీ.. అలాంటిది సాధ్యంకాదని.. మహారాష్ట్ర, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.