ఇవాళ శ్రీవారి దర్శనానికి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తిరుమల వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన్ను మీడియా ప్రతినిధులు, స్థానిక వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. ఒకే ఒక్క ప్రశ్నతో సజ్జలను ఉక్కిరిబిక్కిరి చేశారు.
త్వరలో ఏర్పాటు చేయనున్న టీటీడీ కొత్త పాలక మండలి చైర్మన్ ఎవరు? అని ఆయన్ను ప్రశ్నించారు. దీనికి ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. ప్రధానంగా ఇవాళ మీడియాలో సంక్రాంతికి టీటీడీకి కొత్త చైర్మన్ రానున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, అలాగే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్లు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. బీసీ కోటాలో జంగా కృష్ణమూర్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
అయితే గతంలో టీటీడీ పాలక మండలి చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి ఎన్నో అద్భుతాలు సృష్టించారు. హిందూ మతం విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు టీటీడీ ఆధ్వర్యంలో ఎస్వీబీసీ భక్తి చానల్‌ను ఆయన ఆధ్వర్యంలోనే నెలకొల్పారు. అలాగే దళిత గోవిందం, తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు, తిరుమలకు వెళ్లిన ప్రతి భక్తుడు స్వామి దర్శనంతో సంబంధం లేకుండా అన్న ప్రసాదం స్వీకరించడం, అన్నమయ్య భారీ విగ్రహాన్ని ఆయన స్వగ్రామమైన తాళ్లపాకలో ఏర్పాటు చేయడం తదితర మంచి పనులు భూమన ఆధ్వర్యంలోనే జరిగాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఆయనకే చైర్మన్ పదవి ఇవ్వొచ్చనే ప్రచారం గత కొంత కాలంగా విస్తృతంగా సాగుతోంది.
దీంతో కొత్త చైర్మన్ అంశం తెరపైకి రావడంతో తమ నాయకుడికే దక్కుతుందని తిరుపతి వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ తనకు చైర్మన్ పదవి వస్తుందని భూమన ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. మరోవైపు బీసీలకు పెద్ద పీట వేసే క్రమంలో జంగా కృష్ణమూర్తికి చైర్మన్ పదవి ఇచ్చే అవకాశాల్ని కొట్టి పారేయలేమని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. ఈ ప్రచారాలు సాగుతుండగా తిరుమలేశుని దర్శనానికి సజ్జల రావడంతో ఆయన్ను కొత్త చైర్మన్ విషయమై ప్రశ్నించారు.
భూమన కరుణాకరరెడ్డికి చైర్మన్ పదవి ఇస్తున్నారనే విషయాన్ని కొట్టి పారేయలేదు. అలాగని ఆమోద ముద్ర వేయలేదు. అలాగే జంగా కృష్ణమూర్తి గురించి ప్రశ్నించగా… అంతా సీఎం ఇష్టమని ఆయన దాటవేయడం గమనార్హం. మొత్తానికి టీటీడీ కొత్త చైర్మన్ పేరు అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. సీఎం జగన్ మనసులో ఏముందో తెలియాలంటే మరో పది రోజులు ఎదురు చూడక తప్పదు.