టీటీడీకి కొత్త చైర్మ‌న్ ఈయ‌నే!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రానున్న ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని బీసీల‌కు మ‌రింత ప్రాధాన్యం క‌ల్పించేందుకు నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా ప్రసిద్ధ ఆధ్యాత్మిక సంస్థ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్‌గా త‌న బాబాయిని సైతం త‌ప్పించేందుకు…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రానున్న ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని బీసీల‌కు మ‌రింత ప్రాధాన్యం క‌ల్పించేందుకు నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా ప్రసిద్ధ ఆధ్యాత్మిక సంస్థ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్‌గా త‌న బాబాయిని సైతం త‌ప్పించేందుకు వెనుకాడ‌డం లేదు. టీటీడీ పాల‌క మండ‌లి నూత‌న చైర్మ‌న్‌గా జంగా కృష్ణ‌మూర్తిని నియ‌మించేందుకు దాదాపు ఖాయ‌మైంద‌ని అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఇదిలా వుండ‌గా వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ పాల‌క మండ‌లి ప‌దవీ కాలం వ‌చ్చే ఏడాది ఆగ‌స్టుతో ముగియ‌నుంది. కానీ ఉత్త‌రాంధ్ర వైసీపీ బాధ్య‌త‌ల‌ను వైవీ చూస్తున్న నేప‌థ్యంలో, పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంపై దృష్టి కేంద్రీక‌రించేందుకు టీటీడీ చైర్మ‌న్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పిస్తున్నార‌ని తెలిసింది. వైకుంఠ ఏకాదశి దర్శనాలు ముగిసిన త‌ర్వాత చైర్మ‌న్ బాధ్య‌త‌ల నుంచి వైవీ త‌ప్పుకోనున్నారు.

ఈ నేప‌థ్యంలో టీటీడీ కొత్త చైర్మ‌న్‌గా బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన జంగా కృష్ణ‌మూర్తి పేరును సీఎం ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. ఈయ‌న యాద‌వ సామాజిక వ‌ర్గ నేత‌. ప‌ల్నాడు జిల్లా గుర‌జాల‌లో రాజ‌కీయ కార్యక‌లాపాలు సాగిస్తున్నారు. వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ప‌ని చేశారు. ఈయ‌న సేవ‌ల్ని గుర్తించి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు టీటీడీ చైర్మ‌న్‌గా నియ‌మించి బీసీల‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాల‌ను జ‌గ‌న్ పంప‌ద‌లిచారు. గ‌తంలో చంద్ర‌బాబు కూడా పాల‌న చివ‌రి రోజుల్లో పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు టీటీడీ చైర్మ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఆ త‌ర్వాత ఏమైందో తెలిసిందే. అయితే జ‌గ‌న్ సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌కు టీటీడీ చైర్మ‌న్ నియామ‌కం ఎంత వ‌ర‌కు ఉప‌క‌రిస్తుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.