ఈ ఏడాది ఇప్పటి వరకూ శ్రీశైలం ప్రాజెక్టు గుండా ప్రవహించిన కృష్ణా నది నీరు పద్నాలుగు వందల టీఎంసీలకు పైనే అని జలవనరుల సంబంధ నిపుణులు వివరిస్తూ ఉన్నారు! కర్ణాటకలో భారీఎత్తున వర్షాలు కురవడంతో ముందుగా కృష్ణా నదికి భారీ వరదలు వచ్చాయి. గత పుష్కర కాలంలో రానటువంటి స్థాయి వరదలు అవి. ఆ తర్వాత ఏపీలో వర్షాలు పుంజుకున్నాయి, కర్ణాటకలో కొనసాగాయి. రాయలసీమలో కూడా ఈ సారి భారీ స్థాయిలో వర్షాలు కురిశాయి. చరిత్రలో చూడని వర్షాలను చూస్తున్నామని అక్కడి ప్రజలు చెబుతూ ఉన్నారు.
ఇలా ఇంటా, బయల భారీ వర్షాలు కురవడంతో రాయలసీమ ఈ సారి సమృద్ధిగానే కనిపిస్తూ ఉంది. ఇక రికార్డు స్థాయిలో మరోసారి శ్రీశైలం గేట్లను ఎత్తారు. భారీ ఎత్తున నీళ్లను దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ ఎప్పుడో నిండింది, ఆ ప్రాజెక్టుకు కూడా ఈ సారి పలుమార్లు గేట్లు ఎత్తారు. పులిచింతలలో నలభై టీఎంసీల వరకూ నీటిని నిల్వ ఉంచారు. ప్రకాశం బ్యారేజ్ కు ప్రమాద హెచ్చరికలు జారీ అవుతూనే ఉన్నాయి. ఇలా భారీ ఎత్తున నీరు దిగువకు వెళ్లింది. కొన్ని వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. ఇదీ పరిస్థితి.
ఇదే సమయంలో రాయలసీమలో ఉన్న చిన్నపాటి వాటర్ ప్రాజెక్టులకు మాత్రం నీటి లభ్యత అరకొరే కావడం గమనార్హం. భారీ ఎత్తున, కొన్ని వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి కానీ, సీమ వైపుకు మాత్రం వెళ్లడం లేదు! గత పాలకుల తీరు వల్లనే ఇదంతా అని రాయలసీమ వర్గాలు వాపోతూ ఉన్నాయి. ఉన్నంతలో ఎంతో కొంత వైఎస్ చేశారని, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ఇప్పుడు వెళ్తున్న నీళ్ల కు అయినా దారి చూపింది వైఎస్ రాజశేఖర రెడ్డే అని వారు చెబుతున్నారు.
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పుడు ఈ మాత్రం నీరు అందుతూ ఉన్నాయన్నా, అక్కడ పది టీఎంసీల స్థాయి నుంచి రెండు మూడు టీఎంసీల స్థాయి డ్యామ్ ల నిర్మాణం అయినా జరిగిందంటే అది వైఎస్ చలువే అని వారు వివరిస్తూ ఉన్నారు. అయితే పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి సీమ ప్రాజెక్టులకు నీటి విడుదల సామార్థ్యం ఇప్పటికీ తక్కువగానే ఉంది. దాన్ని పెంచితేనే ఇలాంటి వరదల సమయంలో అయినా సీమ ప్రాజెక్టులకు వరద నీటిని వదిలే అవకాశం ఉంటుందని వారు వివరిస్తున్నారు. ఎప్పడో కానీ ఇలాంటి వరదలు రావు.
కనీసం వరద సమయంలో అయినా నీటిని వదులుకునే అవకాశం రావాలంటే..పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ విడుదల సామర్థ్యం పెంచాలని వారు కోరుతూ ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇందుకు సంబంధించి ఆదేశాలు ఇచ్చారు. వరద వచ్చినప్పుడే ఒడిసిపట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని ఆయన ఆదేశించారు. అందుకు సంబంధించి అధికారులు రంగంలోకి దిగారు. ఇలాంటి పనులు ఇప్పుడు త్వరగా పూర్తి అయితే, ముందు ముందు ముందు అయినా ఉపయుక్తంగా ఉంటాయి.
సీమ ప్రజలకు వైఎస్ ఎంతో చేశారు. అందుకే ఇప్పుడూ ఆయన స్మరన తప్పనిసరిగా ఉంటుంది. తండ్రికి ధీటుగా నిలవాలంటే జగన్ ఇలాంటి ఉపయుక్తమైన పనులకు శ్రీకారం చుట్టడమే కాకుండా, పూర్తి చేయాలి. అప్పుడే చరిత్రకు ఎక్కుతారు.