చేరికలు తక్కువ హడావుడి ఎక్కువ అన్నట్టుగా ఉంది భారతీయ జనతా పార్టీ వ్యవహారం. ఒకవైపు ఏపీలో అధికారం తమదే అని కమలనాథులు ప్రకటించుకుంటూ ఉన్నారు. అలా ప్రకటించుకోవడం చాలామందికి కామెడీగా అనిపించవచ్చు. ఇటీవలి ఎన్నికల్లో కేవలం సున్నా పాయింట్ నాలుగుశాతం ఓట్లను పొందిన బీజేపీ ఏపీలో అధికారం తమదే అని అనడం ప్రహసనంగా అనిపించవచ్చు. తెలుగుదేశం పార్టీ కూడా వ్యక్తపరచనంతటి ధీమాను కమలనాథులు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇక మాటలకు తగ్గ స్థాయిలో నేతల చేరిక కూడా లేదు కమలం పార్టీకి. భారతీయ జనతా పార్టీ ముందుగా రాయలసీమను లక్ష్యంగా చేసుకుందట.
రాయలసీమలో రాణిస్తుందట. అందుకే అక్కడచేరికలకు ప్రాధాన్యతను ఇస్తోందట. రాయలసీమకు సంబంధించి బీజేపీ వాళ్లు గతంలోనే ఒక డిక్లరేషన్ ఏదో ప్రకటించారు. అయితే రాయలసీమ మీద బీజేపీవి మాటలు మాత్రమే. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా.. అలాంటప్పుడు రాయలసీమకు ప్రత్యేకంగా బీజేపీ చేసింది ఏమిటి? మాటలు చెప్పడం కాకుండా, సీమ మీద బాధ్యతతో ఏదైనా చేసిందా? ఆఖరికి వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చే నామమాత్రపు నిధులను కూడా ఇప్పుడు ఇవ్వడం మానేశారు.
దేశంలో ఇతర వెనుకబడ్డ జిల్లాలకు నాలుగు వేల రూపాయలు ఇచ్చేచోట రాయలసీమలోని వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చింది కేవలం నాలుగు వందల రూపాయలే. అయితే ఆ నాలుగు వందలు కూడా ఇవ్వడం మానేశారు. ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లి ఆ నిధుల విషయమై అడిగారు. అయితే అలాంటి విషయాల గురించి కమలనాథులు మాట్లాడారు. రాయలసీమలో బలోపేతం అంటూ ప్రకటనలు చేసుకునే కామెడీ రాయుళ్లు.. తాము సీమకు చేసింది ఏమిటో, చేస్తోంది ఏమిటో చెప్పరు. అదేమంటే.. జెండా భుజనా వేసుకుని ర్యాలీలు తీస్తున్నారు. వీటిని చూసి కూడా జనాలు నవ్వుకుంటున్నారు.
నిన్నమొన్నటి వరకూ వేరే పార్టీలో ఉండి, ఆ పార్టీ అధికారం కోల్పోగానే బీజేపీలోకి చేరి భుజనా జెండా వేసుకుని తిరిగితే.. తాము దేశభక్తులం అయిపోతామని కొంతమంది కాంట్రాక్టర్లు భావిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి క్యాడర్ ఉండి, ఓటు బ్యాంకు ఉన్నప్పుడే అలాంటి వారి వేషాలను సీమ జనాలు సీరియస్ గా తీసుకోలేదు. అలాంటిది క్యాడరంటూ లేని బీజేపీ తరఫున ఇలాంటి ఫిరాయింపు నేతలు జెండా వందనాలు చేసేస్తే జనాలు నవ్వుకోక మరేం చేస్తారు. అదేంటో ఒక్కోరికి బీజేపీలోకి ఫిరాయించగానే రాయలసీమ భక్తి పుట్టుకు వచ్చింది. ఒకరేమో ముఖ్యమంత్రులు సీమ వారే అయిన సీమకు అన్యాయమే అని అంటున్నారు.
మొన్నటి వరకూ చంద్రబాబుకు రైట్ హ్యాండ్ గా వ్యవహరించిన వ్యక్తి ఇప్పుడు సీమ గురించి మాట్లాడితే అక్కడి జనాలు నోళ్లతో నవ్వడం లేదు. చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులు ఒత్తి, శ్రీబాగ్ ఒడంబడికను తుంగలో తొక్కుతున్నప్పుడు, కర్నూలుకు గత ఐదేళ్లలో అన్యాయం జరుగుతన్నప్పుడు నోరు మెదపని వాళ్లు ఇప్పుడు.. రాయలసీమ.. ముఖ్యమంత్రులు… అంటూ కామెడీలు చేస్తూ ఉన్నారు. వీళ్ల అమాయకత్వం ఏమిటంటే, జనాలు తమను నమ్ముతున్నారని అనుకోవడం. వీళ్ల వేషాలను జనాలు చాలానే చూశారు. ఇప్పుడు కొత్త వేషాలు చూస్తున్నారు.
ఆ సంగతలా ఉంటే.. చేరికలతో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావడం ఏమో కానీ, కొత్త రచ్చలు జరగడం మాత్రం గ్యారెంటీ అని అంటున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ బీజేపీ నేతగా చలామణిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రియమైన శత్రువు ఆదినారాయణ రెడ్డి కమలం గూటికి చేరారు. ఇది సీఎం రమేశ్ కు ఏ మాత్రం ఇష్టం లేని అంశం అట. ఆదినారాయణ రెడ్డి చేరిక సమయంలో ఢిల్లీలో ఏపీ నేతలు ఎవరూ లేకుండా చూడటంలో సీఎం రమేశ్ విజయవంతం అయ్యారట!
ఇదీ కథ. ఒకవైపు బలోపేతం అంటూ ప్రకటనలు చేసుకుంటూనే..అప్పుడే చేరిన వారి మధ్యన ఇలాంటి రచ్చలు తెరమీదకు వస్తుండటం విశేషం. ముందు ముందు వీరు కమలం పార్టీలో భారీ రచ్చలే చేసే అవకాశాలున్నాయని ఇది వరకూ తెలుగుదేశం ఉండి విబేధించుకున్నారు, ఇప్పుడు బీజేపీ వేదిక అవుతోందని కడప జిల్లా జనాలు అంటున్నారు!