రాజకీయం అంటే బాలకృష్ణకు ఒక ఆటవిడుపు. తనకు వీలైన సమయంలో, తీరిక దొరికిప్పుడు తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి వెళ్తూ ఉంటారు. అలా నియోజకవర్గానికి వెళ్లి ఆయన ‘వేషాలు’ వేస్తూ ఉంటారు. బైక్ నడిపి, తొడలుకొట్టి, మీసాలు దువ్వి ఆయన జనాలను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. ఒక సినిమా హీరో జనాలను ఎలా ఎంటర్ టైన్ చేయగలరో.. అదే విధంగా బాలకృష్ణ వ్యవహరిస్తూ ఉంటారు. అయితే జాక్ పాట్ గా ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా నెగ్గారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విబేధాలతో సతమతం అయిపోయి హిందూపురంలో బాలకృష్ణను గెలిపించింది. పదే పదే ఇన్ చార్జిలను మార్చడంతో గెలవాల్సిన నియోజకవర్గంలో ఆ పార్టీ మరోసారి ఓటమిని మూటగట్టుకుంది. ఇదే హిందూపురం పాలిట మరోసారి శాపం అయ్యింది. ఆటవిడుపు ఎమ్మెల్యేనే మళ్లీ మిగిలారు.
ఎట్టకేలకూ బాలకృష్ణకు మరోసారి నియోజకవర్గం గుర్తుకు వచ్చింది. ఎన్నికలు అయిపోయి ఐదు నెలలు అవుతున్న తరుణంలో ఆయన నియోజకవర్గానికి వెళ్లారు. యథారీతిన సమస్యలను చెప్పుకోవడానికి జనాలు క్యూ కట్టారు. బాలకృష్ణ కూడా వారిని అదిలించి, బెదిరించి తన దారిని తను వెళ్లిపోయారు.
ఎట్టకేలకూ తమ ఎమ్మెల్యేకు నియోజకవర్గం గుర్తుకు వచ్చిందని ఆనందపడాలో, లేక ఆయన చుట్టపుచూపుగా వచ్చి వెళ్లినందుకు బాధపడాలో అర్థంకావడం లేదని అంటున్నారు హిందూపురంలోని సామాన్యప్రజానీకం.