అసలు వదిలేసి కొసరుపై చర్చలేంటి?

హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించడంతో ప్రతిష్టంభన తొలుగుతుందని అంతా భావించారు. ఒకరోజు కాకపోతే, మరోరోజైనా చర్చలు సఫలం అవుతాయని అనుకున్నారు. కానీ కేవలం కోర్టును తృప్తిపరిచేందుకే…

హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించడంతో ప్రతిష్టంభన తొలుగుతుందని అంతా భావించారు. ఒకరోజు కాకపోతే, మరోరోజైనా చర్చలు సఫలం అవుతాయని అనుకున్నారు. కానీ కేవలం కోర్టును తృప్తిపరిచేందుకే కేసీఆర్ చర్చలకు అంగీకరించారనే విషయం మొదటిరోజే తేలిపోయింది.

అవును.. చర్చల కోసమని పిలిచి ఆర్టీసీ విలీనం గురించి కాకుండా మిగతా అంశాలపై చర్చించాలని అధికారులు అనడంతోనే అసలు రచ్చ మొదలైంది. హైకోర్టు చెప్పిన ప్రకారం, 21 అంశాలపైనే చర్చిస్తామని అధికారులు అనడంతో కార్మిక సంఘాలు ఆశ్చర్యపోయాయి. హైకోర్టు అలాంటిదేం చెప్పలేదని వాదించాయి. పూర్తిగా 26 అంశాలపై చర్చించాలని కోరాయి. కానీ అధికారులు మాత్రం తమ పట్టు వీడకపోవడంతో చర్చలు ప్రారంభమైన కొద్దిసేపటికే ముగిశాయి.

మొదటిరోజు జరిగిన చర్చలు ఎలా ఉన్నాయంటే, మరోసారి అధికారులు, కార్మిక సంఘాలు కలిసి కూర్చోవడం అసాధ్యం అనేలా తయారయ్యాయి. చర్చల సారాంశాన్ని రేపు హైకోర్టులో విన్నవిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కోర్టు ఆదేశాల మేరకు తిరిగి చర్చలు మొదలవుతాయా లేక యథాతథ స్థితి కొనసాగుతుందా అనే విషయం తేలుతుంది.

మరోవైపు కార్మిక సంఘాలు మాత్రం సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించాయి. అంతేకాదు, ఇంతకుముందే నిర్ణయించినట్టు 30వ తేదీన సకల జనుల సమర భేరీ జరిపి తీరుతామని స్పష్టంచేశాయి. ఎప్పుడు చర్చలకు పిలిచినా తాము సిద్ధంగా ఉంటామని, చర్చలు ప్రారంభమయ్యాయనే నెపంతో సమ్మెను ఆపమని కోరడం సమంజసం కాదని స్పష్టంచేశాయి.

అయితే ఒకటి మాత్రం నిజం. చర్చలు మాత్రం ప్రజాస్వామ్యయుతంగా జరగలేదు. జేఏసీ నేతల మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అందర్నీ కాకుండా కేవలం నలుగురు నాయకుల్ని మాత్రమే చర్చల కోసం లోపలకు పంపించారు. మరోవైపు అధికారులు మాత్రం 16 మంది కూర్చున్నారు. చుట్టూ పోలీసు బందోబస్త్ ఏర్పాటుచేశారు.

ఇంత నిర్బంధ వాతావరణంలో చర్చలు సక్సెస్ అవుతాయని ఆశించడం అత్యాశే అవుతుంది. దీనికితోడు లోపలకొచ్చిన తమను ప్రలోభపెట్టారంటూ జేఏసీ నాయకులు ఆరోపించడం కొసమెరుపు. 

అవును కాదు.. ఇది ఆవిరి.. ఎమోషన్ వేడి