నామినేటెడ్ పోస్టులు అంటే వాటికి ఎంతో కొంత ప్రయారిటీ ఉంటుంది. అందుకే.. పలువురు సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ నాయకులు తమకు తగిన పోస్టులను దక్కించుకోవడానికి నిత్యం పెద్ద నాయకుల చుట్టూతా తిరుగుతూ వారి భజన చేస్తూ గడుపుతూ ఉంటారు. ఎంత చిన్న పోస్టు అయినా సరే.. దానికి ఒక పెద్ద హంగు, తతంగం ఉంటాయి. పెద్ద నాయకుల సిఫారసులు, అవి ఇచ్చే వారి వద్దకు నేరుగా వెళ్లి ‘మా మనిషి సర్.. పదవి ఇవ్వండి’ అని విన్నవించుకోవడాలూ ఇలా అనేకం ఉంటాయి.
నానా రకాల పైరవీలు ముఖతః కూడా అయిన తర్వాత మాత్రమే చిన్నవైనా సరే నామినేటెడ్ పోస్టుల పందేరం ఉంటుంది. అంతో ఇంతో వైభోగం ఉండే పార్టీ నామినేటెడ్ పదవుల సంగతైనా అంతే. అలాంటిది కేంద్రంలో రెండు దఫాలుగా అధికారం వెలగబెడుతున్న, దేశమంతా తమ హవా కొనసాగిస్తున్న భారతీయ జనతా పార్టీ లో నామినేటెడ్ పదవి అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ పదవుల్ని గుడ్డిగా పంచిపెట్టేస్తున్నారని.. ఎంపీగారి సిఫారసు ఉత్తరం ఉంటే చాలు.. దఖలు చేసేస్తారని ఈ ఉదంతం వింటే అర్థమవుతుంది.
భాజపాకు చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కార్యాలయం నుంచి ఓ లేఖ వచ్చింది. ‘అయ్యా.. తమరు ఒకరి గురించి సిఫారసు చేశారు. సదరు వ్యక్తికి మీరు సూచించిన విధంగా మేం నామినేటెడ్ పదవిని కట్టబెట్టేశాం’ అనేది ఆ లేఖ సారాంశం. ఆ లేఖ చూసుకుని అర్వింద్ నివ్వెరపోయారు. అసలు నేనెవరికి లేఖ ఇచ్చానబ్బా.. అని ఆశ్చర్యపోయారు. ‘‘నా లెటర్ హెడ్ ఫోర్జరీ అయింది మొర్రో.. దాన్నెవరో దుర్వినయోగం చేశారు.. దానిమీద విచారణ జరిపించండి..’’ అంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
విషయం ఏంటంటే.. ధర్మపురి అర్వింద్ లెటర్ హెడ్ మీద హైదరాబాదులోని ఆల్విన్ కాలనీకి చెందిన తలిశెట్టి సుధాకర్ అనే వ్యక్తిని దిశ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమించాలంటూ ఓ సిఫారసు ఉత్తరం వెళ్లింది. కేంద్ర నిధులతో అమలుచేసే పథకాలపై అధికారిక సమీక్షల్లో పాల్గొనే అధికారం ఈ సభ్యులకు ఉంటుంది. లేఖ వెళ్లగానే సదరు మంత్రిత్వశాఖ ఎలాంటి క్రాస్ చెక్ లేకుండా పదవి కట్టబెట్టేశారు. ఆ సంగతి ఎంపీగారికి సమాచారం వచ్చాక అసలు బాగోతం బయటపడింది.
అయితే తిరుమలలో దర్శనానికి ఎంపీ ఎమ్మెల్యేల లెటర్ హెడ్ లను బ్లాక్ మార్కెట్ లో విచ్చలవిడిగా అమ్ముకోవడం గురించి విన్నాం. కేంద్ర ప్రభుత్వం నియమించే నామినేటెడ్ పోస్టులకు కూడా లెటర్ హెడ్ ల ఫోర్జరీ చేస్తున్నారంటే.. గమనించకుండా పదవులూ ఇచ్చేస్తున్నారంటే.. ఆశ్చర్యపోవడం తప్ప ఏం చేయగలం?