భారత్ లో కరోనా భయాలు మరోసారి పెరుగుతున్న వేళ.. కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే చాలామంది 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. కాకపోతే బూస్టర్ డోస్ తీసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలో బూస్టర్ డోస్ కింద, నాజల్ వ్యాక్సిన్ ను తీసుకొచ్చింది భారత్ బయోటెక్ సంస్థ.
ఇప్పటికే ఇండియాలో కోవాగ్జిన్, కోవీషీల్డ్ పాపులర్ అయ్యాయి. చాలామంది ఈ రెండు రకాల వ్యాక్సిన్లను మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా కరోనా కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ వ్యాక్సిన్లకు అదనంగా ముక్కులో వేసుకునే నాజల్ టీకాను అందుబాటులోకి తెచ్చింది భారత్ బయోటెక్. దీని పేరు ఇంకోవాక్.
ముక్కులో డ్రాప్స్ రూపంలో తీసుకునే ఈ వ్యాక్సిన్ జనవరి నాలుగో వారం నుంచి అందుబాటులోకి రాబోతోంది. అయితే ఇది చిన్న పిల్లలకు కాదు. 18 ఏళ్లు దాటిన వాళ్లు మాత్రమే ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. దీన్ని బూస్టర్ డోస్ కింద మాత్రమే వాడాలి. ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు ఎవరైనా ఉంటే, వాళ్లు ఇది వాడకూడదు.
ఈ నాజల్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కు తాజాగా కేంద్రం అనుమతి ఇవ్వడంతో, దీనికి ధరలు నిర్ణయించారు. ఇంకోవాక్ సింగిల్ డోస్ టీకా రేటు 800 రూపాయలు. అయితే సదరు కంపెనీ మాత్రం దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 320 రూపాయలకే అమ్ముతామని ప్రకటించింది. దీనికి స్థానిక పన్నులు అదనం.
ప్రస్తుతానికి బూస్టర్ డోస్ పంపిణీపై కేంద్రం మౌనంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం బూస్టర్ డోస్ ను ఉచితంగా ఇస్తామంటోంది. ప్రైవేట్ గా ఈ డోస్ వేసుకోవాలంటే మాత్రం 800 రూపాయలకు పైగా చెల్లించాల్సిందే.