అవతార్ 2 @ రూ.7000 కోట్లు

వరల్డ్ బాక్సాఫీస్ లో అవతార్-2 సినిమా మరో మైలురాయి అందుకుంది. తాజా వసూళ్లతో ఈ సినిమా 7000 కోట్ల రూపాయల మార్క్ అందుకుంది. రిలీజైన 10 రోజులకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 855 మిలియన్…

వరల్డ్ బాక్సాఫీస్ లో అవతార్-2 సినిమా మరో మైలురాయి అందుకుంది. తాజా వసూళ్లతో ఈ సినిమా 7000 కోట్ల రూపాయల మార్క్ అందుకుంది. రిలీజైన 10 రోజులకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 855 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో దాదాపు 7వేల కోట్ల రూపాయలు) వసూళ్లు వచ్చాయి.

ఈ ఏడాది వరల్డ్ బాక్సాఫీస్ లో అత్యథిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల జాబితాలోకి అవతార్-ది వే ఆఫ్ వాటర్ మూవీ చేరింది. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు వస్తున్నాయి కాబట్టి, ఈ ఏడాది టాప్-2 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

అమెరికాలో మంచు తుపాను విరుచుకుపడుతోంది. ఈ ప్రభావం అవతార్-2 సినిమాపై ఉన్నప్పటికీ, వసూళ్లలో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి కనిపిస్తోంది. మరోవైపు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ అవతార్-2కు మంచి వసూళ్లు వస్తాయని ట్రేడ్ భావిస్తోంది.

350 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి 1 బిలియన్ డాలర్ మార్క్ ను అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

అమెరికా కాకుండా, మిగతా దేశాల విషయానికొస్తే.. ఈ సినిమాకు చైనా, కొరియా, ఫ్రాన్స్, భారత్, జర్మనీ నుంచి ఎక్కువగా వసూళ్లు వస్తున్నాయి.

భారత్ లో అవతార్-2 హవా కొనసాగుతోంది. రణ్వీర్ సింగ్ తాజా చిత్రం ఫ్లాప్ అవ్వడంతో, అవతార్-2కు ఎదురులేకుండా పోయింది. ఇటు సౌత్ లో కూడా మరో వారం పాటు ఈ సినిమాకు ఆక్యుపెన్సీ ఉంటుందనేది ఓ అంచనా.

ఇండియాలో ఈ సినిమా మొత్తం వసూళ్లు ఇప్పుడు దాదాపు 258 కోట్ల రూపాయలకు చేరాయి. ఈ చిత్రం భారీ వసూళ్లను కొనసాగిస్తూ రూ.300 కోట్లు నెట్ మార్క్‌ను దాటితే, ఇది భారతదేశంలో అత్యథిక వసూళ్లు సాధించిన రెండో హాలీవుడ్ మూవీ అవుతుంది. దాదాపు రూ. 367 కోట్ల వసూళ్లతో 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' అగ్రస్థానంలో ఉంది.