కర్ణాటకలో బీజేపీ నుంచి నేతలు బయటకు వెళ్లి పార్టీలు పెట్టడం కొత్త కాదు. 2013 అసెంబ్లీ ఎన్నికలప్పుడు అటు యడియూరప్ప, ఇటు శ్రీరాములు ఇద్దరూ బీజేపీని వీడి బయటకు వెళ్లారు. తనకు సీఎం సీటును కాకుండా చేశారని యడియూరప్ప, కేసుల విషయంలో సపోర్ట్ లేకపోవడంతో శ్రీరాములు చెరో పార్టీ పెట్టారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో నెగ్గింది.
బీజేపీని యడియూరప్ప పార్టీ బాగా దెబ్బతీసింది. యడియూరప్ప కనీస స్థాయిలో సీట్లను నెగ్గలేకపోయినా ఓట్లను అయితే చీల్చారు. కాంగ్రెస్ కు మేలు చేశారు. ఈ విషయంలో శ్రీరాములు వంతు కూడా ఎంతో కొంత ఉంది. అప్పుడు శ్రీరాములు పెట్టిన బీఎస్ఆర్ పార్టీకి గాలి సోదరుల మద్దతు ఉండింది. ఈ పార్టీ 2.7 శాతం ఓట్లను పొందింది, నాలుగు అసెంబ్లీ సీట్లను నెగ్గింది. ఆ తర్వాత బీజేపీ ఈ ఇరు వర్గాలతోనూ రాజీ చేసుకుంది.
గత ఎన్నికల సమయంలో కూడా శ్రీరాములును స్టార్ క్యాంపెయినర్ గా బీజేపీ తిప్పింది. ఒక దశలో సీఎం అభ్యర్థిత్వ ఆశావహుల్లో శ్రీరాములు ఒకరుగా నిలిచారు. డిప్యూటీ సీఎం అనే ప్రచారమూ జరిగింది. తెలుగు మూలాలున్న శ్రీరాములుకు సరైన కన్నడ కూడా రాదని, అతడిని సీఎంగా చేస్తారా అంటూ సిద్ధరామయ్య ఎద్దేవా చేశారప్పుడు.
శ్రీరాములు కర్ణాటకలో నాయక సామాజికవర్గానికి చెందినవారు. వీరినే రాయలసీమలో బోయలుగా పరిగణిస్తారు. బోయ సామాజికవర్గ జనాభా రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఎలా ఉంటుందో.. బళ్లారి, చిత్రదుర్గ, గంగావతి ప్రాంతాల్లో కూడా అదే తరహాలో ఉంటుంది. వీరి ఓట్లను గంపగుత్తగా పొందితే నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సులువుగా నెగ్గవచ్చు. ఈ ప్రాంతామంతా అనంతపురం జిల్లా తరహాలోనే సామాజికవర్గ లెక్కలుంటాయి. రెడ్లు, బోయలు, కురుబలు, వీరితో పాటు వక్కలిక, లింగాయత్ కమ్యూనిటీల వారూ ఉంటారు. ఈ ప్రాంతానిది తెలుగు మూలాలే. రాజకీయ పటంలో కర్ణాటకలో కలిసిపోవడంతోనే కన్నడ ప్రభావం పెరిగింది.
ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ ప్రభావం కూడా ఈ ప్రాంతంలోనే ఉంటుంది. జనార్ధన్ రెడ్డి తన పార్టీని నలభై అసెంబ్లీ నియోజకవర్గాల వరకూ నిలపాలని అనుకుంటున్నారట. అయితే కేవలం జనార్ధన్ రెడ్డి పేరుతో ఏ మేరకు ఓట్లు లభిస్తాయనేది శేష ప్రశ్నే! బీజేపీ చేతిలో అధికారం ఉంది. ఇలాంటి తరుణంలో ఆ పార్టీ క్యాడర్ రెడ్డితో కలిసి వచ్చే అవకాశాలు తక్కువ. అలాగే బోయలను ప్రభావతం చేయగల శక్తి ఉన్న శ్రీరాములు ఇప్పుడు బీజేపీని కాదనుకుని జనార్ధన్ రెడ్డితో పయనించే అవకాశాలూ తక్కువే!