ఇప్పటికే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పరిస్థితి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేనట్టుగా మారింది. ఇటీవలే ఆయనతో పాటు కాంగ్రెస్ లో చేరిన వారు తమకు పార్టీ లో దక్కిన కమిటీలకు రాజీనామాలేవో చేశారు. అదే సమయంలో రేవంత్ కాంగ్రెస్ రాజీనామా చేయబోతున్నారని, సొంత పార్టీ పెట్టుకుంటారనే ప్రచారానికీ తెరలేచింది. కాంగ్రెస్ లో సీనియర్ల సహాయనిరాకరణతో రేవంత్ విసిగిపోయాడని, ఇక రాజీనామానే తరువాయి అనే టాక్ నడించింది. ఇంతలో ఢిల్లీ నుంచి దూత దిగ్విజయ్ సింగ్ వచ్చారు. మరి ఏం తేల్చారో కానీ.. ప్రస్తుతానికి ఎవరికి వారు సైలెంట్ అయ్యారు.
అయితే కాంగ్రెస్ లో ఇకపై రేవంత్ పరిస్థితి మరింత కార్నర్ అయ్యేలా ఉంది. దీనికి ప్రధాన కారణం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ తెలంగాణలో యాక్టివేట్ అయ్యే ప్రయత్నం చేయడమే. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాజయంతో చంద్రబాబు మళ్లీ తెలంగాణ పేరు గట్టిగా ఎత్తలేదు. అయితే ఏపీలో రాజకీయ ప్రయోజనాలు పొందడానిక చంద్రబాబు తెలంగాణలో మళ్లీ అడుగుపెట్టారు. అంతేకాదు.. తన పాత తమ్ముళ్లను మళ్లీ చేరమంటూ కూడా ఆయన బహిరంగ పిలుపును ఇచ్చారు.
మరి చంద్రబాబు పిలుపునందుకుని ఇప్పుడు పొలోమంటూ రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో చేరకపోవచ్చు.తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు అనిపించుకోవడం కంటే.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిపించుకోవడమే రేవంత్ కు గౌరవం, మర్యాద. ఏ రకంగా చూసినా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీనే బలమైనది. రేవంత్ తన రాజకీయ భవిష్యత్తు అనుకుంటే..కష్టమో, నష్టమో కాంగ్రెస్ లోనే ఉండవచ్చు. మరీ వీలుకాదనుకుంటే బీజేపీకి జై కొట్టవచ్చు.
అయితే రేవంత్ శత్రువులు ఇక ఊరికే ఉండరు. మీ బాస్ చంద్రబాబు మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారు కదా.. ఇక నువ్వూ అటే వెళ్లు అంటూ తెలంగాణ కాంగ్రెస్ నుంచినే రేవంత్ అంటే పడని వాళ్లు ఇక విరుచుకుపడే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ లో ఇలాంటి అసహనాలు కొత్త కాదు. రేవంత్ ను ఇప్పటికీ చంద్రబాబు అనుచరుడు అంటూ విమర్శిస్తారు కాంగ్రెస్ సీనియర్లు. టీడీపీ నుంచి వచ్చిన వాడు తమపై పెత్తనం చలాయించడమా అంటూ విరుచుకుపడతారు. అయితే అదే చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు కూడా ఇది వరకే ముగిసిన ముచ్చట. అయినా అనాలనుకునే వారు ఇవన్నీ లెక్కలేయరు. రేవంత్ పై ఇప్పటికే బోలెడన్ని కంప్లైంట్లను కలిగిన కాంగ్రెస్ నేతలు, చంద్రబాబు తెలంగాణలో రాజకీయం చేస్తున్న సమయంలో పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ ను ఉంచడం శల్యుడికి పగ్గాలప్పగించడం లాంటిదే అంటూ ఢిల్లీకి కొత్త ఫిర్యాదులతో వెళ్లేందుకు మాత్రం అవకాశాలు బాగా పెరిగాయి.