కొడుకు కోసం ఆయ‌న డ్రామాలు చూడ‌త‌ర‌మా!

తండ్రి బీజేపీ, కొడుకు మాత్రం టీడీపీ. ఇంత‌కూ వాళ్లెవ‌రూ ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. అవ‌కాశవాద రాజ‌కీయాల‌కు మారుపేరు బీజేపీ నేత టీజీ వెంక‌టేశ్‌. టీడీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఏపీలో టీడీపీ అధికారం…

తండ్రి బీజేపీ, కొడుకు మాత్రం టీడీపీ. ఇంత‌కూ వాళ్లెవ‌రూ ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. అవ‌కాశవాద రాజ‌కీయాల‌కు మారుపేరు బీజేపీ నేత టీజీ వెంక‌టేశ్‌. టీడీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఏపీలో టీడీపీ అధికారం పోగొట్టుకున్న వెంట‌నే మ‌రో ముగ్గురు రాజ్య‌స‌భ స‌భ్యుల‌తో క‌లిసి టీజీ వెంక‌టేశ్ బీజేపీలో చేరిపోయారు.

ఇప్పుడాయ‌న‌కు ఎలాంటి ప‌ద‌వి లేదు. కేవ‌లం బీజేపీ నాయ‌కుడు మాత్ర‌మే. బీజేపీ బ‌లోపేతానికి బ‌దులు టీడీపీ అభివృద్ధి కోసం టీజీ ప‌ని చేస్తున్నార‌నే విమ‌ర్శ వుంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. రానున్న ఎన్నిక‌ల్లో టీజీ వెంక‌టేశ్ కుమారుడు భ‌ర‌త్ క‌ర్నూలు న‌గ‌రం నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేయ‌నున్నారు. దీంతో కొడుకును ఎలాగైనా గెలిపించుకోవాల‌ని మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే బాగుంటుంద‌ని ఆయ‌న అభిప్రాయం. అందుకే రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌నే కొత్త ప‌ల్ల‌వి ఎత్తుకున్నారు. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మాత్రం… ఏపీలో కుటుంబ, అవినీతి పార్టీల‌కు దూరంగా వుంటామ‌ని ప‌దేప‌దే చెబుతుంటారు. ఈయ‌న గారేమో అబ్బే… రాజ‌కీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జ‌ర‌గొచ్చ‌ని చెబుతున్నారు.

ఓ చాన‌ల్‌తో టీజీ వెంక‌టేశ్ మాట్లాడుతూ  బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య మంచి సంబంధాలున్నాయ‌న్నారు. ఎన్నిక‌ల్లో ఫైట్ చేయ‌డానికే బీజేపీ ఒక అవ‌గాహ‌న‌తో ఉంటుంద‌న్నారు. మిగిలిన సంద‌ర్భాల్లో ఏ పార్టీ అయినా త‌న‌కు తాను బ‌లోపేతం చేసుకోవాల్సి వుంటుంద‌న్నారు. పొద్దున లేచిన‌ప్ప‌టి నుంచి నువ్వేం చేశావ్‌, నేనేం చేశాన‌నే చ‌ర్చ బీజేపీలో వుండ‌ద‌న్నారు. ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకెళ్లే ఎజెండాతో బీజేపీ వుంద‌న్నారు.

టీడీపీతో పొత్తు కుదుర్చుకోవ‌డంపై ఆయ‌న సీరియ‌స్ కామెంట్స్‌ చేశారు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌నడం గ‌మ‌నార్హం. టీడీపీతో భ‌విష్య‌త్‌లో పొత్తు ఉండొచ్చ‌నే న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు ఆయ‌న చేశారు. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి రాజ‌కీయ సంబంధాలుంటాయ‌ని ఆయ‌న అన్నారు. టీడీపీలో ఉన్న కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం వెంక‌టేశ్ ఆరాట‌ప‌డుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పార్టీని మోస‌గించి బీజేపీలో టీజీ వెంక‌టేశ్ చేరినా…. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏనాడూ నోరు మెద‌ప‌లేదు. పైగా వెంక‌టేశ్ కుమారుడు భ‌ర‌త్‌కు క‌ర్నూలు సిటీ టీడీపీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. తండ్రీత‌న‌యుడు వేర్వేరు పార్టీల్లో వుంటూ… సొంత ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తుండడం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. కొడుకు కోసం టీజీ వెంక‌టేశ్ డ్రామాలు ఆడుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.