విశాఖ జిల్లాలో కాపు రాజకీయం యమ జోరుగా సాగింది. ఒక రోజు తేడాతో జరిగిన రెండు సమావేశాలలో రాజకీయ సందడే ఎక్కువగా కనిపించింది. కాపునాడు పేరుతో విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికార వైసీపీ నేతలు ఎవరూ కనిపించలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఎవరూ పాలుపంచుకోలేదు
విశాఖలో కాపునాడు సమావేశం పూర్తిగా బీజేపీ, జనసేనలకే పరిమితమై సాగింది. అయితే కాపులను తమ వైపునకు తిప్పుకోవాలని రాజకీయ పార్టీలు పోటీ పడుతున్న నేపధ్యంలో కాపునాడుకు పోటీగా తూర్పు కాపులు అంతా ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలో సమావేశమయ్యారు.
ఇది పూర్తిగా అధికార వైసీపీ ఆద్వర్యంలో సాగడంతో విపక్షాలకు చెందిన తూర్పు కాపు నాయకులను పిలిచినా ఎవరూ హాజరుకాలేదు. తూర్పు కాపుల సదస్సులో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ యువ మంత్రి గుడివాడ అమరనాధ్ పాల్గొన్నారు. ఈ ఇద్దరు నేతలూ ఉత్తరాంధ్రాలో ఉన్న కాపులంతా తూర్పు కాపులే అని స్పష్టం చేశారు.
వారికోసం వారి సంక్షేమ కోసం వైసీపీ ప్రభుత్వం ఉందని హామీ ఇచ్చారు. ఇచ్చార్పురం మొదలుకుని పాయకరావుపేట దాకా ఉన్న తూర్పు కాపులంతా ఒకే త్రాటి మీద నడవాలని మంత్రులు పిలుపు ఇచ్చారు. వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు రానున్న కాలమలో రాజకీయంగా ఆర్ధికంగా సామాజికంగా అండగా నిలబడతామని వైసీపీ మంత్రులు హామీ ఇచ్చారు. ఇలా తూర్పు కాపుల మీటింగుతో వైసీపీ హడావుడి చేస్తే కాపునాడు పేరిట విశాఖలో విపక్షాలు సందడి చేశాయి. ఇలా కాపు సంరంభంతో విశాఖ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.