బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఏపీలో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభకు తెలుగేతర రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీలో ఆయన జాతీయ నాయకుడు. ఏడాదిన్నర సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని ఆయన పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి బరిలో నిలవాలని జీవీఎల్ నరసింహారావు ఆసక్తి చూపుతున్నారు.
ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలిసింది. అందుకే ఆయన పదేపదే విశాఖలో పర్యటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కాపునాడు ఆహ్వానాన్ని మన్నించి ఆయన వైజాగ్లో నిర్వహించిన కాపుల సభలో పాల్గొనడం వెనుక జీవీల్ పక్కా వ్యూహం దాగి వుంది. ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు ఎక్కువని, వారికి ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్య పరిష్కారానికి చొరవ చూపానని ఆయన గుర్తు చేయడాన్ని గమనించొచ్చు.
అంతటితో ఆయన ఆగలేదు. విశాఖ ఆర్కే బీచ్లో దివంగత వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కాపుల రిజర్వేషన్ అంశంపై రాజ్యసభలో పదేపదే ప్రశ్నిస్తూ, వారి మనసు చూరగొనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వంగవీటి మోహనరంగా పేరును ఎందుకని ఒక జిల్లాకు పెట్టలేదని వ్యూహాత్మకంగా ఆయన ప్రశ్నించారు. ఇలా కాపుల కేంద్రంగా జీవీఎల్ నరసింహారావు రాజకీయం చేస్తున్నారు.
విశాఖ కేంద్రంగా ఎంపీగా పోటీ చేసే క్రమంలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే వార్తల్ని బలపరుస్తోంది. విశాఖ నుంచి స్థానికేతరులు లోక్సభకు ఎక్కువగా ఎన్నికవుతూ వస్తున్నారు. అలాగే విశాఖలో భూకుంభకోణాలపై జీవీఎల్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలో భూఆక్రమణల దారుల భరతం పడతానని ఆయన హెచ్చరించడం వెనుక రాజకీయం లేదంటే నమ్మలేని పరిస్థితి. అయితే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు పాల్పడిన పార్టీ తరపున పోటీ చేస్తే… ఆ వ్యతిరేకతను ఎలా పోగొట్టుకుంటారనేది పెద్ద టాస్కే. ఏది ఏమైనా విశాఖలో తాను కూడా అదృష్టాన్ని పరీక్షకు పెట్టాలని జీవీఎల్ సిద్ధంగా ఉన్నారని తెలిసింది.