పింఛ‌న్ల తొల‌గింపుపై జ‌గ‌న్ ఏమ‌న్నారంటే….!

పింఛ‌న్లు తొల‌గిస్తున్నార‌ని త‌న వ‌ద్ద‌కు పెద్ద సంఖ్య‌లో ల‌బ్ధిదారులు వ‌స్తున్నార‌ని స్వ‌యంగా నెల్లూరు రూర‌ల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డే వాపోయారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పింఛ‌న్లు తొల‌గించొద్ద‌ని ఆయ‌న వేడుకున్నారు. ఈ నేప‌థ్యంలో పింఛ‌న్ల…

పింఛ‌న్లు తొల‌గిస్తున్నార‌ని త‌న వ‌ద్ద‌కు పెద్ద సంఖ్య‌లో ల‌బ్ధిదారులు వ‌స్తున్నార‌ని స్వ‌యంగా నెల్లూరు రూర‌ల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డే వాపోయారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పింఛ‌న్లు తొల‌గించొద్ద‌ని ఆయ‌న వేడుకున్నారు. ఈ నేప‌థ్యంలో పింఛ‌న్ల తొల‌గింపుపై సాగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని సీఎం జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఇవాళ ఆయ‌న పింఛ‌న్ల తొల‌గింపు ప్ర‌చారంపై కీల‌క కామెంట్స్ చేశారు.

రాష్ట్రంలో ఏ ఒక్క‌రి పెన్ష‌న్‌ను తొల‌గించ‌డం లేద‌ని సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. కేవ‌లం రీవెరిఫికేష‌న్ మాత్ర‌మే చేప‌ట్టిన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని ఆయ‌న హామీ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. పెన్షన్లపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్‌ జరగాల‌ని, ఇందులో భాగంగా ఆడిట్‌ జరుగుతుంటే పెన్షన్లు తీసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారనిసీఎం మండిప‌డ్డారు.

ల‌బ్ధిదారుల‌కు నోటీసులిచ్చి రీవెరిఫికేషన్‌ మాత్రమే చేస్తారన్నారు. మంచి పనులను చెడుగా చూపించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విషపు రాతను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తప్పుడు ప్రచారాన్ని కలెక్టర్లు తిప్పికొట్టాలని జ‌గ‌న్ సూచించారు. ఆరు నెల‌ల‌కు ఒక‌సారి ఆడిట్ జ‌ర‌గ‌డం మంచిదే. అర్హుల‌ను ఎంపిక చేసేట‌ప్పుడే జాగ్ర‌త్త‌లు తీసుకుని వుంటే, ఇవాళ రీవెరిఫికేష‌న్‌కు అవ‌స‌రం వుండేది కాదు క‌దా? అనే ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాల్సి వుంది.

రీవెరిఫికేష‌న్ స‌హ‌జంగానే పింఛ‌న్‌దారుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. త‌మ పింఛ‌న్ ఎక్క‌డ పోతుందో అనే ఆందోళ‌న‌తో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, స‌చివాల‌య ఉద్యోగుల వ‌ద్ద‌కు ల‌బ్ధిదారులు ప‌రుగులు తీస్తున్నారు. పింఛ‌న్ల‌లో కోత ఖాయం. అయితే కోత‌కు గురైన వారంతా ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎలా అర్హులు కాదో ప్ర‌భుత్వం వివ‌రించ‌డానికి సిద్ధంగా వుంది. ఎన్నిక‌ల ముంగిట రీవెరిఫికేష‌న్ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా లాభ‌మా? న‌ష్ట‌మా? అనేది ప్ర‌భుత్వ‌మే ఆలోచించాల్సి వుంది.