‘గులాబీ వ్యూహం’

‘పద్మవ్యూహం’ ఛేదించగలిగినవాడు ప్రతిపక్షంలో ఒకే ఒక్కడు! అతగాడు అందుబాటులో లేనప్పుడే ఆ వ్యూహం పన్నారు. మరి ‘గులాబీ వ్యూహం’ ఛేదించడానికి రెండు ప్రత్యర్థి పక్షాల్లో  బోలెడు మంది ఉన్నారు. వారు నెగ్గుతారా? గులాబీ వ్యూహం,…

‘పద్మవ్యూహం’ ఛేదించగలిగినవాడు ప్రతిపక్షంలో ఒకే ఒక్కడు! అతగాడు అందుబాటులో లేనప్పుడే ఆ వ్యూహం పన్నారు. మరి ‘గులాబీ వ్యూహం’ ఛేదించడానికి రెండు ప్రత్యర్థి పక్షాల్లో  బోలెడు మంది ఉన్నారు. వారు నెగ్గుతారా? గులాబీ వ్యూహం, పద్మవ్యూహం కంటె అత్యంత మార్మికమైనదని తేలుతుందా? గులాబీ జాబితా ప్రకటన అనే వ్యూహం.. ఆ పార్టీకి పుష్కలంగా ఉన్న ఆత్మవిశ్వాసానికి ప్రతీక అనుకోవాలా? లేదా, ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడవేసే ఎత్తుగడ అనుకోవాలా?  లేదా, మేకపోతు గాంభీర్య ప్రకటనగా భావించాలా? అనే మీమాంస తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. కేసీఆర్ నిర్ణయం ఇతర పార్టీల మీద చూపగల ప్రభావం, మారగల సమీకరణాలే.. ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘గులాబీ వ్యూహం’

తెలంగాణ రాజకీయాలు కాక మీదికి వచ్చేసాయి. అధికార భారత రాష్ట్ర సమితి తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రకరకాల కారణాల వలన ఇందులో ఒకటి రెండు మార్పు చేర్పులు ఉంటే ఉండవచ్చు. ఎన్నికలు ఇంకా నెలల దూరంలో ఉండగా మిగిలిన పార్టీలు అభ్యర్థులను ప్రకటించే ప్రయత్నానికి ఇప్పుడిప్పుడే శ్రీకారం చుడుతున్నాయి. 

కేసీఆర్ అందరికంటే ముందు పూర్తి జాబితాను విడుదల చేసేయడం కీలక పరిణామం. ఈ ఎన్నికలలో కూడా తాము ఢంకా బజాయించి నెగ్గబోతున్నామనే ఆత్మవిశ్వాసాన్ని ఈ చర్య ప్రజలకు నిరూపిస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఖచ్చితంగా తాము గెలిచి తీరుతామనే నమ్మకంతో ఆ పార్టీ ఉంది. వారి ప్రతి మాటలోనూ గెలుపు గ్యారంటీ అనే ఆలోచనే కనిపిస్తోంది. ఆ కాన్ఫిడెన్స్ కాస్తా శృతిమించి, అహంకారంగా కూడా వారి మాటల్లో కనిపిస్తోంది.

కేసీఆర్ చాలా ముందస్తుగా అభ్యర్థులను నిగ్గుతేల్చి ప్రకటించేయడం అనేది కేవలం భారాస మీదనే కాదు. ఇతర పార్టీల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం మెండుగా ఉంది. భారాసతో ప్రధానంగా కాంగ్రెస్, భాజపాలో తలపడుతున్నాయి. కేసీఆర్ సంధించిన ‘గులాబీవ్యూహం’ ఫలితాలు ఈ రెండు పార్టీల మీద ఎలా ఉండబోతున్నాయనేది ప్రధానం. మాటవరసకు చెప్పుకోవడానికి, వామపక్షాలు, కోదండరాం, షర్మిల వంటి పేర్లుకూడా ఉంటాయి గానీ.. వాటి ప్రభావం చర్చించుకోదగినంత ఉండదు. 

కొన్ని నెలల కిందటి వరకు తెలంగాణలో భారాసకు ప్రత్యామ్నాయం ఎవరు? అనే ప్రశ్నకు స్థిరమైన సమాధానం దొరికేది కాదు. ప్రభావం చూపగల ప్రతిపక్షాలుగా.. కాంగ్రెస్, భాజపా రెండూ ఉన్నాయి గానీ, ఆ రెండింటిలో ఏ ఒక్కరైనా అధికార పార్టీని ఓడించగల స్థాయి ఉన్నవారేనా అనే మీమాంస ఉండేది. భాజపా కేసీఆర్ సర్కారు మీద ఎంత తీవ్రంగా దాడిచేస్తున్నప్పటికీ.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఎన్నికల్లో వారు సాధించగల సీట్లు ఎన్ని? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగానే ఉండేది. 

అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అప్పటిదాకా డోలాయమానంలో ఉన్నఅనేక మంది నాయకులు తెలంగాణ కాంగ్రెస్ వైపు ఆశగా చూసే వాతావరణం కల్పించాయి. అప్పుడున్న వాతావరణాన్ని మరింత బింకంగా ముందుకు తీసుకువెళ్లడంలో బిజెపి విఫలం అయింది. అందుకే గులాబీ వ్యూహం.. ఈరెండు ప్రతిపక్షాలపై చూపగల ప్రభావం చర్చనీయాంశం అయింది. 

కాంగ్రెస్ కే ఎడ్వాంటేజీ

భారాస అందరికంటె ముందుగా జాబితా ప్రకటించి గులాబీ వ్యూహాన్ని సంధించినందుకు అంతో ఇంతో మేలు జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీకే. భారాసలో టికెట్లు దక్కని అసంతృప్తులంతా ఇప్పుడు కాంగ్రెసు వైపే చూస్తున్నారు. ఆ రకంగా కాంగ్రెసుకు కొంత మేలు జరిగింది. ప్రస్తుతానికి రేఖా నాయక్ ఒక్కరే తెరాస నుంచి బయటకు వచ్చి కాంగ్రెసు ఎమ్మెల్యే టికెట్ కు దరఖాస్తు చేసుకుని ఉండవచ్చు గాక.. కానీ ఇంకా అనేకులు కాంగ్రెస్ వెంట నడవడానికి సుముఖంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 

ముందే జాబితాను ప్రకటించడం ద్వారా.. తమకు భయం లేదని.. ఖచ్చితంగా తాము గెలవబోతున్నామని భారాస చెప్పుకున్నట్టుగానే.. కర్ణాటక ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా మారి.. భారాసకు గట్టిపోటీ ఇవ్వగలిగేది, కుదిరితే దెబ్బ కొట్టగలిగేది  కాంగ్రెస్ మాత్రమే అనే సంకేతాలను పంపుతున్నాయి. ఆ ఎఫెక్ట్ ఏమైందంటే.. ప్రస్తుతం ఉన్న పార్టీ నుంచి బయటకు రాదలచుకున్న ప్రతి నాయకుడికి కూడా చేరడానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మాత్రమే కనిపిస్తోంది. ఒక్కొక్కరూ కాంగ్రెస్ ను ఆశ్రయిస్తున్న కొద్దీ.. ప్రజల్లో కొద్దీ వారి గ్రాఫ్ పెరుగుతోంది.

కాంగ్రెసు పార్టీ దరఖాస్తుల వ్యవహారం పూర్తయ్యే సమయానికి కూడా.. కాంగ్రెస్ కు తప్పకుండా విజయావకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వారంతా చాలా బలంగా నమ్ముతున్నారనే సంకేతాలు వెళుతున్నాయి. అందుకు కొన్ని కారణాలున్నాయి. కాంగ్రెసు పార్టీలో ప్రస్తుతం ముగ్గురు లోక్ సభ ఎంపీలు ఉండగా.. ఆ ముగ్గురూ కూడా.. ఎమ్మెల్యే పదవులకు దరఖాస్తు చేసుకున్నారు. పార్లమెంటును వదలి అసెంబ్లీకి వస్తున్నారంటే.. అసెంబ్లీలో గెలుపు తథ్యం కావొచ్చునని ప్రజలుకూడా అనుకుంటారు. 

తమాషా ఏంటంటే.. ఇప్పటిదాకా తన రాజకీయ జీవితంలో ఎన్నడూ అసెంబ్లీకి పోటీచేసి ఎరగని మధుయాష్కీ గౌడ్ వంటి నాయకుడు కూడా.. ఎమ్మెల్యే బరిలో నిలవాలని కోరుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్యే పదవుల కోసం దరఖాస్తులు కూడా పోటెత్తాయి. అది కూడా ఆ పార్టీకి ఒక సానుకూల సంకేతం. ఇంతమంది డబ్బు కట్టి మరీ టికెట్లకు దరఖాస్తు చేయడం చూసి ప్రజలు వారి మీద కాస్త నమ్మకాన్ని పెంచుకుంటారు. అలాగే దరఖాస్తుల్లో ఇంకో విషయాన్ని కూడా గమనించాల్సి ఉంది. 

కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబంలో రెండేసి టికెట్లు ఇవ్వకూడదని గతంలో ఒక నియమం పెట్టుకుంది. అయితే ఈ సందర్భంలో ఒక్కో కుటుంబంనుంచి రెండేసి టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు పదిమందికి పైగా ఉన్నారు. వీరందరూ ఇంతగా చేస్తున్న ప్రయత్నాలు పార్టీకి ఉన్న ప్రాభవానికి సంకేతాలుగా ప్రజలు భావిస్తే తప్పు కాదు.

భారాస అనేది భారతీయ జనతా పార్టీకి బి టీమ్ అనే ప్రచారాన్ని కాంగ్రెస్ చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ల గలిగింది. గులాబీ దళాలు చాలా ఆందోళన చెందిన కవిత- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అంతా సద్దుమణిగిపోవడం, కిషన్ రెడ్డి సారథి అయిన తర్వాత కేసీఆర్ సర్కారు మీద కాషాయదాడి సుతిమెత్తగా మారిపోవడం వంటి పరిణామాలు కూడా ఈరెండు పార్టీలో ఒకటే జట్టు అనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. 

అలాగే ఇం.డి.యా. కూటమి ఆధ్వర్యంలో మోడీ వ్యతిరేక పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తే.. కేసీఆర్ మాత్రం జాతీయ పార్టీగా అవతరించి దేశమంతా తానొక్కడే మూడో శక్తిగా పోటీచేస్తా అనే తరహా మాటలు చెప్పడం కూడా.. ఈ ఇద్దరూ కుమ్మక్కయ్యారనే అభిప్రాయాన్ని కలిగించేవిగా తయారయ్యాయి. మోడీ వ్యతిరేక ఓటును చీల్చడానికే కేసీఆర్ డ్రామా అనుకుంటున్న వారూ ఉన్నారు. 

బిజెపికి డిజడ్వాంటేజీ

తెలంగాణలో కేసీఆర్ ను ఓడించగలిగేది తాము మాత్రమే.. అని కమలదళం చాలా కాలం పాటూ చాలా ఘనంగా ప్రచారం చేసుకుంది. కానీ వారి దూకుడు క్రమక్రమంగా మసకబారిపోయింది. ఒకప్పట్లో బండి సంజయ్ పార్టీ సారథిగా ఉండగా.. కేసీఆర్ వ్యతిరేకతతో చెలరేగిపోయిన ఆ పార్టీ.. పగ్గాలు కిషన్ రెడ్డి చేతికి వచ్చిన తర్వాత.. తేలికగా  తీసుకుంటోందా అనే అభిప్రాయం కలుగుతోంది.

ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ముఠా తగాదాలకు మారుపేరుగా ఉంటే.. ఇప్పుడు కాషాయదళంలో అదే సంస్కృతి కనిపిస్తోంది. కమలనాయకులందరూ ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పార్టీ ఎలా పోతే మనకెందుకులే.. కేంద్రంలో ఎటూ మళ్లీ అధికారంలోకి వస్తాం.. పార్టీనే నమ్ముకుని ఉంటే.. ఏదో నాలుగు ఢిల్లీ పైరవీలు చేసుకుంటే చాలు జీవితం గడిచిపోతుంది అన్నట్లుగా వారు తయారైపోతున్నారు. 

అసెంబ్లీలో పార్టీ ఎలా తగలడిపోయినా.. ఎంపీ ఎన్నికల్లో కాస్త గట్టిగా ఫోకస్ పెట్టి నెగ్గుదాం.. అనే ధోరణిలో కూడా కొందరు ఆ పార్టీలో తయారవుతున్నారు. ఇదంతా భారాస మీద పోరాడడంలో కమలదళానికి ఉత్సాహం సన్నగిల్లిపోయిందనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి వ్యాప్తి చెందించేలా వారి వ్యవహార సరళి ఉంటోంది. ఖమ్మంలో అమిత్ షా సభ నిర్వహించినంత మాత్రాన ఒక్కసారిగా ఆ పార్టీ గ్రాఫ్ లంబంగా పెరిగిపోతుందని అనుకోవడం కూడా భ్రమ.

ఖమ్మం జిల్లాలో ఆర్థికంగాను, జనబలం పరంగానూ గట్టి నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తమలో చేర్చుకోవడానికి చేసిన విఫలయత్నాలు వారి పరువు తీశాయి. కేసీఆర్ ను ఓడించగల పార్టీగా బిజెపిని తాను నమ్మడం లేదని.. పొంగులేటి ఇండైరక్టుగా తేల్చేశారు. అలాగే ఇతరత్రా కొందరు నాయకులను తమ జట్టులోకి తీసుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. పరిస్థితి ఎలా తయారైందంటే.. రకరకాల కారణాల వల్ల ఇటీవల పార్టీలోకి వచ్చిన వారకూడా.. తిరిగి బయటకు వెళ్లిపోయే వాతావరణం ఏర్పడుతోంది.

బిజెపి గ్రాఫ్ పడిపోయిందా? అని ప్రజలకు అనుమానం కలగడానికి వారి స్వయంకృతాపరాధారాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ రాష్ట్రంలో తాము గెలిచి తీరుతామని వారు ఎప్పటినుంచో డప్పు కొట్టుకుంటున్నారు. అలాంటి వాళ్లు కనీసం కొన్ని నియోజకవర్గాల విషయంలోనైనా అభ్యర్థులు ఎవరనే నిర్ణయానికి ఆల్రెడీ వచ్చి ఉంటే బాగుండేది. అలా జరగలేదు సరికదా.. అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతోంటే రెండు రాష్ట్రాలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాలను విడుదల చేసింది. దీనివలన ప్రజల్లోకి భిన్నమైన సంకేతాలు వెళతాయి. 

ఆ రెండు రాష్ట్రాల్లో బిజెపికి తమ బలం గురించి నమ్మకం ఉన్నది గనుక జాబితాలు వచ్చాయని, తెలంగాణలో గతిలేదు గనుక.. జాబితా రాలేదని.. అసలు వారికి అభ్యర్థులే లేరని.. ఇతర పార్టీలు అన్నీ జాబితాలను తేల్చేసి.. అక్కడి అసంతృప్తులంతా వచ్చి తమలో చేరేవరకు బిజెపి ఎదురుచూస్తూనే గడుపుతుందని.. అప్పటిదాకా వారికి అభ్యర్థులకు గతిలేదని ఒక ప్రాపగాండా జరగడానికి ఆస్కారం ఏర్పడింది.

బిజెపికి కొంత నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే.. ఇతరత్రా జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయాల సంగతి ఎలా ఉన్నా సరే.. కేసీఆర్ ఓటమిని మాత్రమే కోరుకునే ప్రముఖులు తెలంగాణలో కొందరున్నారు. వారికి వేరే ఎజెండా లేదు. ఉండదు. అలాంటి వారిని కమలదళం ఇటీవలి కాలంలో కాస్త మాయచేసి తమ జట్టులో చేర్చుకోగలిగింది. కేంద్రంలో ఎటూ తామే మళ్లీ అధికారంలోకి వస్తాం గనుక.. ఏదో ఒక లబ్ధి ఉంటుందని వారికి తాయిలాలు చూపి తమలో కలుపుకున్నారు. 

అలాంటి వారు ఇప్పుడు రాష్ట్రంలో మారుతున్న పార్టీల బలాబలాలను గమనిస్తున్నారు. కాంగ్రెస్ ఒక్కసారిగా పుంజుకున్న బలాన్ని కూడా వారు గమనిస్తున్నారు. అలాంటి వారు భాజపా నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోడానికి ఏమాత్రం సంకోచించరు. కేసీఆర్ ను ఎవరు మట్టికరిపించగలరని వారు నమ్ముతారో.. వారి వెంట ఉండడానికి మాత్రమే ఆసక్తి చూపుతారు. అలాంటి వారు కూడా వచ్చి చేరితే కాంగ్రెస్ కు ఎడ్వాంటేజీ అవుతుంది. బిజెపి మరింత బలహీనపడుతుంది.

వామపక్షాల పరువు పోయింది..

బిజెపి, కాంగ్రెస్ ల పరిస్థితి అలా ఉంటే.. వామపక్షాల పరువు పూర్తిగా పోయింది. మునుగోడులో కేసీఆర్ తమ ఆసరా తీసుకున్నారు గనుక.. ఆయన వ్యతిరేకించే ఇం.డి.యా. కూటమిలో తమ జాతీయ పార్టీలో భాగస్వాములుగా ఉన్నాసరే.. రాష్ట్రంలో ఆయన తమను అక్కున చేర్చుకుని తాము అడిగినన్ని సీట్లు ఇవ్వాలనే అనుచితమైన అత్యాశతో.. వారు సుదీర్ఘంగా నిరీక్షించి భంగపడి ప్రజల దృష్టిలో చులకన అయిపోయారు. సీపీఐ, సీపీఎం తాము కలిసి పోటీచేస్తాం అని అంటూనే.. కాంగ్రెస్ తో పొత్తు కోసం పరోక్షంగా తహతహలాడుతూ.. తమ పరువు తామే తీసుకుంటున్నారు. 

ఈ రకంగా ముందుగా జాబితా విడుదల చేయడం అనే ఒకే ఒక్క గులాబీ వ్యూహం ద్వారా.. కేసీఆర్ అన్ని పార్టీల మీద వివిధ తీర్లుగా ప్రభావం చూపిస్తున్నారు. అయితే ఆ గులాబీ వ్యూహాన్ని ఛేదించి లోపలకు వెళ్లి పోరాడగల అభిమన్యుడి స్థాయి తెలివితేటలు ప్రతిపక్షాల్లో కొందరికి ఉండవచ్చు  గాక.. కానీ.. అదే గులాబీ వ్యూహాన్ని ఛేదించి.. వారిని మట్టి కరిపించగల అర్జునుడి స్థాయి చాతుర్యం, సమర్థత ఎవరికైనా ఉన్నదో లేదో ప్రజలు నిర్ణయిస్తారు.

.. ఎల్. విజయలక్ష్మి