టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్‌పైనే గుంటూరు, విజయవాడ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని కోపమా అంటే? ఔననే సమాధానం టీడీపీ వర్గాల నుంచి వస్తోంది. లోకేశ్ తీరుపై టీడీపీ సీనియర్ నేతలు ఆగ్రహంగా ఉన్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. లోకేశ్ రాంగ్ రూట్లో వెళ్తున్నారని, అతని మాట తీరు, అలాగే చుట్టూ ఉన్న బ్యాచ్‌పై సీనియర్ నేతలు విసుగ్గా ఉన్నారు.
చంద్రబాబుతో సౌకర్యంగా ఉన్నప్పటికీ, లోకేశ్ విషయానికి వచ్చే సరికి ఇబ్బంది పడుతున్నారు. తాజాగా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబుతో పాటు గల్లా జయదేవ్, కేశినేని నాని ఉండడం విశేషం. ఈ ఇద్దరు నాయకులు లోకేశ్ పాదయాత్ర వైపు కన్నెత్తి చూడకపోవడం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టీడీపీకి దూరంగా ఉన్నారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఈ ప్రచారాన్ని టీడీపీ ఎంపీలు ఖండించకపోవడం గమనార్హం. అసలే టీడీపీకి ఉన్నది ముగ్గురు ఎంపీలు. వారిలో ఇద్దరు ఎంపీలు తమ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో లోకేశ్ పాదయాత్ర చేస్తుంటే వెళ్లకపోవడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ వెళితే మాత్రం విమానాశ్రయంలో స్వాగతం పలకడం మొదలు, ఆయన కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకూ వుంటున్నారు.
బాబుతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ, తమ నాయకుడి పాదయాత్ర వైపు కన్నెత్తి చూడకపోవడం ఏంటని లోకేశ్ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లోకేశ్ పాదయాత్రలో పాల్గొనని నాయకులను వెంటబెట్టుకుని తిరగడం ఏంటని ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ అధిష్టానంపై ఆగ్రహంగా వుంది. చంద్రబాబు అండ వుందనే అలుసుతోనే గల్లా జయదేవ్, కేశినేని నాని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని లోకేశ్ తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
కేశినేని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని లోకేశ్ అంటున్నట్టు సమాచారం. గల్లా జయదేవ్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుంటూ, పదవిని అడ్డు పెట్టుకుని సొంత వ్యవహారాలను చక్కబెట్టుకున్నారనేది లోకేశ్ వర్గీయుల ఆరోపణ.