దివంగత ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సోమవారం విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతిని ఆహ్వానించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబునాయుడు, నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానాలు అందడం గమనార్హం.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే చంద్రబాబునాయుడు, టీడీపీ ముఖ్య నాయకులు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎన్టీఆర్ తనయ పురందేశ్వరి తదితరులు ఢిల్లీకి చేరుకున్నారు. నందమూరి వారసులంతా పాల్గొంటారనే చర్చ జరుగుతోంది. అయితే చంద్రబాబుతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ కార్యక్రమంలో పాల్గొనడంపై ఉత్కంఠ కలిగిస్తోంది. 2009లో టీడీపీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ప్రచారంలో పాల్గొని వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కూడా టీడీపీని ఆదరించాలని వేడుకున్నారు. ఆ తర్వాత కాలంలో జూనియర్ ఎన్టీఆర్‌కు చంద్రబాబు నిజస్వరూపం తెలిసొచ్చింది. జూ.ఎన్టీఆర్‌తో రాజకీయంగా తన కుమారుడు లోకేశ్‌కు ప్రమాదం పొంచి వుందని చంద్రబాబు భయపడ్డారు. అప్పటి నుంచి జూ.ఎన్టీఆర్‌కు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తూ వచ్చారు.
మహానాడుకు జూ.ఎన్టీఆర్‌ను ఆహ్వానించిన పాపాన పోలేదు. గతంలో కూకట్‌పల్లిలో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలో నిలిపినా జూ.ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించలేదు. చంద్రబాబు సభల్లో జూ.ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంపై ఆయన ఆగరహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తాత ఎన్టీఆర్ స్మారక నాణేన్ని రాష్ట్రపతి ఆవిష్కరించే కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనడంపై చర్చకు తెరలేచింది.
దేవర సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారని సమాచారం. ఒకవేళ చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరు కారని తెలిసి వుంటే, జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి వుండేవారని అంటున్నారు.