ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ, మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. విద్యాదీవనకు సంబంధించి బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. ఈ అధికారిక కార్యక్రమం ఘనంగా జరగబోతోంది. అయితే ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గాన్ని పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అక్కడి ప్రజలకు ప్రతిసారీ బోలెడు వరాలు కురిపిస్తూ ఉండడం అందరికీ తెలిసిందే.
ఏ నియోజకవర్గంలో సభ పెట్టిన సరే ఆ ప్రాంత సమస్యలన్నింటిని ముందుగానే తెలుసుకి, ఆయా సమస్యలకు తమ ప్రభుత్వం చూపగలిగిన పరిష్కారాల గురించి జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెబుతూ ఉంటారు. అదే విధంగా రాజకీయంగా కూడా నాయకులకు కాస్త స్పష్టత ఇస్తూ ఉంటారు. నగరి నియోజకవర్గంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటల ఫలితంగా కొంత ప్రతిష్టంభన ఏర్పడి ఉన్న ప్రస్తుత తరుణంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా ఉంది.
తొలివిడతలోనే మంత్రి పదవి ఆశించినప్పటికీ భంగపడి రెండో విడతలో దక్కించుకున్న నగరి ఎమ్మెల్యే రోజాకు అక్కడ తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆమె వ్యతిరేక వర్గానికి జిల్లాలోని మరొక కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ప్రచారం కూడా ఉంది.
రోజా మంత్రి పదవిలో ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గంలోని చాలా మండలాలలో సొంత పార్టీ నాయకులు ఆమె మాట ఖాతరు చేయకుండా, ఆమెను ధిక్కరించి, ఆమెతో నిమిత్తం లేకుండా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం చాలా కాలంగా జరుగుతోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన చక్రపాణి రెడ్డికి జగన్ మోహన్ రెడ్డి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. దీని వెనుక జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉన్నదనే ప్రచారం ఉంది.
నగరిలో రోజాకు మళ్లీ టికెట్ ఇస్తే పార్టీ నాయకులు ఎవ్వరూ పనిచేయరని, సదరు చక్రపాణి రెడ్డి, ఏకంగా జగన్మోహన్ రెడ్డి వద్దనే చెప్పినట్లుగా స్థానికంగా ప్రచారం ఉంది. ఇలాంటి సంక్లిష్టతల మధ్య రోజా కాస్త నిశ్చింతగా పనిచేసుకోగలిగేలాగా జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఏదైనా వరం ఇవ్వబోతున్నారా లేదా అని నగరి ప్రజలు ఎదురుచూస్తున్నారు.
నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహించినప్పుడు, అక్కడి ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ దక్కే పరిస్థితి ఉంటే, జగన్ ఆ సభలోనే ఆ విషయం ప్రకటిస్తున్నారు. ‘మీ ఎమ్మెల్యేను మళ్లీ గెలిపించి తీరాల్సిన బాధ్యత మీదే’ అనే మాటలతో ఆయన అభ్యర్థిత్వాలని ధృవీకరిస్తున్నారు. అయితే రోజాకు స్థానికంగా అసమ్మతి నాయకులు పొగబెడుతున్న తరుణంలో, నగరి వేదిక మీద నుంచి ఇలాంటి ప్రకటన జగన్ చేస్తారా లేదా అనేది చర్చనీయాంశం.
‘చెల్లెమ్మ రోజాను మళ్ళీ గెలిపించి శాసనసభకు పంపాల్సిన బాధ్యత మీదే’ అనే తరహా స్పష్టమైన సంకేతాలను జగన్ ఈ సభలో ఇస్తారా లేదా? ఒకవేళ అలాంటి మాట జగన్ నోటి నుంచి రాకపోయినట్లయితే, రోజాకు టికెట్ ఇవ్వడం లేదని తమ మాటే నెగ్గిందని ఇప్పటినుంచే రెండో వర్గం ప్రచారం మొదలుపెట్టేయకుండా ఉంటుందా? అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది.